అమ్మవారికి తనను నమ్ముకున్న వారు అంటే ఎంత ప్రేమో - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" ప్రేమరూపా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 730 వ నామం . 

" ప్రేమరూపా " అంటే ప్రేమయే స్వరూపముగా కలవారు అమ్మవారు అని భాష్యం చెప్పారు. అమ్మవారు చండిక, రాక్షసులను సంహరిస్తారు అనుకుంటాం. సంహరించడం కూడా వారిమీద దయతో ముక్తినివ్వడం కోసమే. పుణ్యకర్మలు చేయడానికి ఎన్నో అవకాశాలను ఇస్తారు. ఇక ప్రయోజనం లేదు అనుకున్నప్పుడే శిక్షిస్తారు. 

పోతనగారి ఆంధ్రభాగవతంలో ఓ అద్భుత శ్లోకం ఉంది:

" పాయని గేహశృంఖలలఁ 

  బాసి నిరంతర మత్పరత్వ

  ముంజేయుచు నున్న మీకుఁ 

  బ్రతిజేయ యుగంబుల నైన   

  నేర; నన్ బాయక కొల్చు 

  ‌‌మానసము 

  ప్రత్యుపకారముగాఁ 

  దలంచి నాపాయుటఁ   

  దప్పుగాఁ   

  గొనక భామినులార! 

  కృపన్ శమింపరే "

" ఓ భామలారా, వీడరాని సంసారమనే సంకెళ్ళను వీడి నాయందే ఎడతరగని మనస్సు లీన మొనర్చిన మీకు యుగపరిమాణం గల దీర్ఘకాలం చెల్లిపోయినా ప్రత్యుపకారం చేయలేను. నేను మిమ్మెడబాయుట కృతజ్ఞత లేనందుకు కాదు. నన్ను నిరంతరం స్మరించడం కోసమే. ఇదే మీకు నేనొర్చిన ప్రత్యుపకారంగా భావించి మిమ్ము బాసిన దొక తప్పుగా తలంచబోకండి. నామీద కరుణతో ఓర్చుకొనండి " 

కృష్ణుడు గోపికలతో " భామినులార, కృపన్ శమియింపరే " - దయతో క్షమించండి అంటారు అప్పుడు. భక్తులంటే ఎంత ప్రేమో.

గోపికలను అనుగ్రహించాలని నిశ్చయించుకుని కృష్ణుడు ఓ శరత్కాలపురాత్రి కల్పవృక్షం దగ్గర వేణునాదం చేస్తూంటే గోపికలు బంధాలు త్రెంచుకుని కృష్ణుడి వద్దకు వస్తారు. గోపికలు " మనం ఎంత అదృష్టవంతులం. మనకన్నా అదృష్టవంతులు ఎవరయినా ఉంటారా " అనుకుంటారు. మనకన్నా అనే ఆలోచన భౌతిక బంధాన్ని సూచిస్తుంది. అందుకని కృష్ణుడు అంతర్ధానం అయ్యారు. అర్ధరాత్రి గోపికలు కృష్ణుడిని వెతుకుతూ బాధతో అలసిపోతారు. అప్పుడు కృష్ణుడు తిరిగి ప్రత్యక్షమవుతారు. గోపికలు ఆర్తితో కృష్ణుడి పాదాలు చేతులు పట్టుకుంటే అప్పుడు కరుణతో పైవిధంగా మాట్లాడుతూ " నేను మీ ఉన్నతి కోసమే అంతర్ధానం అయానని భావించి నన్ను క్షమించండి " అంటారు కృష్ణుడు. 

తనను నమ్ముకున్న వారంటే అంత ప్రేమ. ప్రేమరూపులు.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ