అమ్మవారు భక్తులను ఇతరుల కుట్రలనుంచి కాపాడుతూ ఉంటుంది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" పరమంత్రవిభేదినీ " - అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 812 వ నామం.

పరమంత్రవిభేదినీ అంటే ఇతర ( లోకకళ్యాణం కోసం కానివి ) మంత్రాలను ఛేదిస్తుంది. 

మంత్రం లోకకల్యాణం కోసం ఉపయోగపడాలి. జీవితం ధర్మబద్ధంగా ఉండాలి. సాధన సాత్వికంగా ఉండాలి. ఆలోచనలు సాత్వికంగా ఉండాలి. అలా లేని మంత్రాలని అడ్డుకుంటుంది. 

" మననాత్ త్రాయతే ఇతి మంత్రః " అని తెలియచేస్తున్నాయి శాస్త్రాలు. మంత్రాలు రక్షణని ఇస్తాయి. ఎవరికి?. జపం చేసుకునే వారికి, లోకానికి కూడా. లోకం సురక్షితంగా ఉంటేనే కదా మనం సుఖంగా జీవించేది. ఎప్పుడూ కొట్టుకు చస్తూ, పరాయి దేశాలపై ద్వేషంతో ఉండే దేశాలలో ఆనందం ఎలా ఉంటుంది.

అమ్మవారి ఈ నామ శక్తి/అనుగ్రహం హనుమ లంకలో ప్రవేశించినప్పుడు తెలుస్తుంది. చిన్నరూపంలో ( పిల్లి అంత వానరం ) హనుమ లంకలో ప్రవేశించి భవనాలని, రక్షణవ్యవస్థని, మనుషులనీ, అన్నివైపులా పరిస్థితులు ఎలా ఉన్నాయో అని నిశితంగా గమనిస్తున్నారు. ఆయుధాలు పట్టుకుని యోధులు తిరుగుతున్నారు. కొందరు మంత్రవేత్తలు దర్భలు పట్టుకుని తిరుగుతున్నారుట. దేనికి?. ఎవరయినా శతృవులు కనబడకుండానో సూక్ష్మరూపంలోనో లంకలో ప్రవేశిస్తే వీరి మంత్రశక్తికి దొరికిపోతారు. మరి సూక్ష్మ రూపంలో ఉన్న హనుమ దొరికారా అంటే లేదు. ఆయన వచ్చినది రామకార్యం అంటే లోకకళ్యాణం కోసం. మరి అమ్మవారు అనుగ్రహించకుండా ఉంటారా. పరమంత్రాన్ని పనిచేయకుండా చేసారు. అదీ కారణం. వారి మంత్రాంగం హనుమ మీద పనిచేయలేదు.

ఇంద్రజిత్తు నికుంభలా యాగం చేస్తున్నాడు. అది పూర్తయితే అతను అజేయుడు, లోకానికి అశాంతి. పైగా అతను అధర్మపరుడు. వివాహమయిన పరస్త్రీని అపహరించిన తండ్రికి మద్దతుగా నిలిచాడు. అందుకని లక్ష్మణుడి ద్వారా ఆ యాగాన్ని భగ్నం చేయించింది.

" మంత్రాంగం " అని తరచూ వింటూటాం. మనకు హాని తలపెట్టడానికి మంత్రాంగం చేస్తూ ఉండవచ్చు ఎవరయినా. మనం అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే ఆ పరుల " మంత్రాంగం " ని ఛేదిస్తుంది తల్లి. అవ్యాజకరుణామూర్తి. 

" శివుడి ఆజ్ఞ లేనిదే చీమయినా కుట్టదు " అంటారు. అంటే ఇదే. తనను నమ్ముకున్న భక్తుల యోగక్షేమాలను అమ్మవారే చూసుకుంటారు.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ