మృత్యువు అంటే ఏమరుపాటు, మరణం కాదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" సర్వమృత్యునివారిణీ " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 552 వ నామం. 

" సర్వమృత్యునివారిణీ " అంటే అన్నిమృత్యువులనీ నివారించేది అని. మరణం అనేది ఒకసారే కదా వచ్చేది. మరి అన్ని మరణాలను నివారించడమేమిటి అమ్మవారు. 

అమ్మవారి ప్రతీనామానికి ఓ పరమార్ధం ఉంది. ఒక్కోనామాన్ని జపంచేసుకుంటే ఒక్కో ఫలితం కనిపిస్తుంది.

మృత్యువు అంటే ఉపనిషత్తులు చెప్పిన అర్ధం " ఏమరుపాటు " అని. అంతే కాని చావుకాదు. శరీరాన్ని " నేను " అనుకోవడమే ఏమరుపాటు. తను " ఆత్మ " అని ఎరుకలేకపోవడమే అజ్ఞానం. అదే మృత్యువు.

శంకరాచార్యులు " బ్రహ్మ సత్యం, జగన్మిధ్య, జీవో బ్రహ్మ ఏవ నపరః " అన్నారు. జీవుడు ( మనం ) బ్రహ్మ ఒకరే అన్నారు. అది తెలుసుకోలేకపోవడమే ఏమరుపాటు, అజ్ఞానం, మృత్యువు. 

కంచిపరమాచార్యులు, రమణమహర్షి, రామకృష్ణపరమహంస లాంటివారికి ఈ శరీరం ఒక వాహకమే. జీవుడు ముక్తిపొందడానికి తగిన కర్మలు చేయడానికి దీనిని వాడుకుంటాడు అంతే. 

విమానాశ్రయానికి వెళ్ళడానికి టాక్సీ మాట్లాడుకుని వెడతాం. అక్కడికి చేరడంతో సరి, ఆ తరువాత ఆ టాక్సీ గురించి ఆలోచనేచెయ్యం. మధ్యలో పాడయ్యింది అనుకుందాం, కొంచెం సేపు బాగుపడుతుందేమోనని చూస్తాం, ఈ లోపులో ఇంకో టాక్సీ వస్తే ఎక్కి వెళ్ళిపోతాం. " పాపం ఆ టాక్సీకి అలా అయిందేమిటి, బాగుపడిందో లేదో " అని బాధపడడమే జరుగదు. జ్ఞానులకి ఈ శరీరంపై అటువంటి అంటే " ఇది నేను కాదు " అనే అభిప్రాయమే ఉంటుంది. 

ఈ శరీరంతో ఉపయోగంలేదనో లేక ఇంక అవసరంలేదనో జీవుడు అనుకుంటే వదిలి వెళ్ళిపోతాడు. 

అజ్ఞానం వల్లే మోహం, లోభం, శోకం, రోగం వస్తాయి. సమాజంలోని రుగ్మతలన్నింటికీ ఈ అజ్ఞానమే కారణం. ఒక్కసారి ఈ శరీరం అశాశ్వతం, నేను నాది అన్నది భ్రమ అని తెలుసుకుంటే అంతా సుఖమే, ఎక్కడ చూసినా సంతోషమే వెల్లివిరుస్తుంది. 

ధర్మరాజుని యక్షుడు అడుగుతాడు " సృష్టిలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి " అని. ధర్మరాజు అంటారు " తనకళ్ళముందరే తనవారందరూ ఒక్కొక్కరూ మరణిస్తూన్నా తను మాత్రం శాశ్వతం అనుకుంటాడు మనిషి " అని. అనుకోవడమే కాదు నానా చెడుపనులూ చేస్తూంటాడు కూడా.

అటువంటి మాయ ( మృత్యువు, ఏమరుపాటు ) నుంచి బయటపడాలంటే అమ్మవారి అనుగ్రహం తప్పక అవసరం. మాయను తప్పించి అందరి జీవితాలను స్ఫూర్తిమయం, సుఖమయం చెయ్యమని " సర్వమృత్యునివారిణి " ని వేడుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య 

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ