,యజ్ఞం అంటే త్యాగం - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" యజ్ఞరూపా " - అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 769 వ నామం.
అమ్మవారు యజ్ఞస్వరూపురాలు.
లలితాసహస్రం లోనూ విష్ణుసహస్రం లోనూ చాలా నామాలు ఒకలాగే అనిపిస్తాయి.
విష్ణుసహస్రం లో ఇలా ప్రార్ధిస్తాం:
" యజ్ఞో యజ్ఞపతిః యజ్వా
యజ్ఞాంగో యజ్ఞవాహనః "
అంటే ఆయన యజ్ఞస్వరూపుడు.
యజ్ఞం అంటే ఉపనిషత్తులు చెబుతూన్నది " త్యాగం " అని. దీనికి " నేను, నాది " అన్నది ప్రక్కనపెట్టి కొంత త్యాగం చేస్తూ ఉండాలి. ఏపని అయినా యజ్ఞంలా అంటే క్రమశిక్షణతో శ్రద్ధగా చెయ్యాలని చెబుతారు. తల్లిదండ్రులు, గురువులు, సన్నిహితస్నేహితులు ప్రతీరోజూ చేసేది యజ్ఞమే అని గ్రహించాలి.
ఏదయినా పని అవకపోతే " దేనికయినా పెట్టిపుట్టాలి " అని అంటూంటారు. ఈ పెట్టడమే త్యాగం క్రిందకు వస్తుంది. " యధాశక్తి " మనకు ఉన్నదాంట్లో కొంత దానధర్మాలకి ఖర్చుపెడితే తిరిగి అదే మనల్ని అవసరమయినప్పుడు ఆదుకుంటుంది.
శ్రీగరికిపాటివారు ప్రవచనం చేస్తూ ఓ చక్కటి విషయం చెప్పారు.
ఓ పండితుడు జుట్టు బాగా పెరిగిపోవడంతో సెలూన్ కి వెళ్ళాడు క్షవరానికి. షాపతను " గురువుగారూ రండి " అని కూర్చోబెట్టి పని మొదలెట్టాడు. అతను అడిగాడు " గురువుగారూ దేవుడు అసలు ఉన్నాడంటారా " అని. ఈయనకి కంగారు పుట్టింది - తన జుట్టు వాడి ఒకచేతిలోనూ, వాడి రెండో చేతిలో కత్తెర ఉండడం వల్ల. ఎందుకు అలా అనిపించింది అంటే అతనన్నాడు " ఇంతమంది కరోనాతో చచ్చిపోతున్నారు, నానా బాధలు పడుతున్నారు, కరుణామయుడు ఎలా అవుతాడండి, అభిషేకాలు చేయించుకుంటూ గుళ్ళో కూర్చుంటే " అని. నేను ఇంటికెళ్ళి స్నానం కానిచ్చి చెయ్యవలసిన పనులున్నాయి, సాయంత్రం 4 గం కి మా ఇంటికి వస్తే అన్నీ చెబుతానన్నారు ఈయన.
4 గం కి అతను వస్తే ఇద్దరూ కలిసి బజార్ కి వెళ్ళారు. అక్కడ ఇటూ అటూ తిరుగుతూన్న మగవారిని మాత్రం పరికిస్తూ ఉండమన్నారు అతన్ని. ఓ అరగంట అయాక వారిలో గెడ్డాలు, మీసాలు జుట్టూ పెరిగిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అడిగితే " అబ్బో చాలామందే " ఉన్నారన్నాడు అతను. " వాళ్ళు తీరికలేకో, బద్ధకించో క్షవరం చేయించుకోలేకపోతూ ఉండి ఉండవచ్చు, నీ చేతిలో విద్య ఉంది, డబ్బులు కూడా వస్తాయి, నువ్వే ఇంటింటికి వెళ్ళి ఆ పని చెయ్యవచ్చు కదా " అంటే అతను " నాకేమి ఖర్మండీ, అవసరమయితే వాళ్ళే వస్తారు నా షాపుకి " అన్నాడు.
" కదా, మరి డబ్బులు అవసరమైన నువ్వే నాకేమి ఖర్మ అన్నావు, దేవుడికేమి పట్టిందయ్యా, వీళ్ళ ఇంటి అరుగుమీద కూర్చుని వీళ్ళు బయటకు వెళ్ళి రోగం తెచ్చుకోకుండా కాపలాకాయడానికి " అన్నారు. ఆయన అలా వచ్చి కాపాడేలా వీళ్ళు ఏమి చేసారని. ఎప్పుడైనా గుడికి 4 పళ్ళు తీసుకెళ్ళారా, ఓ 10 రూ లు దక్షిణ వేసారా. గుడిని నమ్ముకుని 10 మంది - పూజారి, టికెట్స్ వ్రాసేవాడు, గుడిని శుభ్రం చేసేవారి కుటుంబాలు - బ్రతుకుతున్నారే. రోడ్డు ప్రక్కన అడుక్కుంటూన్నవారికో, పేదలకో భోజనం చెయ్యమని ఓ 50 రూ లు ఇచ్చారా ఎప్పూడయినా " అని అడగంతో వాడు కంగుతిన్నాడు.
యధాశక్తి అని అంటారు కాని దీనికి ఓ లెక్క ఉంది. 300 సంపాదించేవాడు 10 రూ లు ఇస్తే లక్ష సంపాదించేవాడు కూడా " యధాశక్తి " అన్నారుగా అని 10 ఇచ్చేడనుకోండి అప్పుడు దేవుడు " రివర్స్ " ఆలోచనచేసి అతని " లక్ష " అదాయాన్ని 300 చేస్తాడు. అతనికి " యధాశక్తి " అంటే 500 లేక 1000 కాని 10 రూ లు కాదు.
ఎవరైనా ఒక మంచిపని చేస్తే ఆ మంచే అతన్ని కష్టకాలంలో ఆదుకుంటుంది. దేవుడు రాడు ఎవరినో ఒకరిని సహాయానికి పంపిస్తాడు సరి అయిన సమయానికి. అలా ఆయన ఆదుకోవాలంటే ఉన్నంతలో " యధాశక్తి " త్యాగం చేసి దేవుడి దృష్టిలో " పెట్టి పుట్టాడు " అనే ముద్ర వేయించుకోవాలి ముందర.
" ధర్మో రక్షతి రక్షితః ".
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య
శుభం భూయాత్
Comments
Post a Comment