తను ఆచరిస్తూ ఆచరింపచేసేవారు ఆచార్యులు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" విప్రప్రియా " అమ్మవారి అద్భుతనామం. ఇవి శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 887 వ నామం.
" విప్రప్రియా " అంటే విప్రులను ఇష్టపడేది. " విప్ర " అంటే బ్రాహ్మణుడు అని ఒక అర్ధం. విపులంగా తెలుసుకుందాం ఈ పదాన్ని గురించి.
పుట్టుకతో బ్రాహ్మణుడు అయినవాడు సంస్కారం/ఉపనయనంతో " ద్విజుడు " అవుతాడు. ఈ ద్విజుడు వేదాల్ని అభ్యసించి విప్రుడు అవుతాడు. ఈ మూడు అర్హతలు పొందినవారిని శ్రోత్రియులు అంటారు. అతడు వేదజీవనం పాటించాలి. ఆచారాలను పాటించాలి. " ఆచారహీనం నపునంతి వేదాః " అన్నారు. అంటే " ఆచారహీనుడిని వేదం కూడా పవిత్రుడిని చెయ్యలేదు " అని తెలుసుకోవాలి.
కంచిపరమాచార్యులు విప్రులు గురుస్వరూపులు, వారిని గౌరవించినప్పుడే సమాజం బాగుంటుంది అని చెప్పారు.
వేదాల్ని అభ్యసించి విప్రుడు అయిన వారికి ధర్మానికి, అధర్మానికి తేడా తెలుస్తుంది. ధర్మపాలన కోసం శ్రమిస్తూ ధర్మాన్ని నిలబెట్టడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అమ్మవారి ఇంకోనామం " ధర్మాధారా " - అంటే " ధర్మానికి ఆధారమయినది " అని అర్ధం. సృష్టి అంతా ధర్మం మీదే ఆధారపడింది, సృష్టి సక్రమంగా లయబద్ధంగా జరగాలంటే ధర్మం నిలబడాలి. మరి అటువంటి ధర్మానికోసం ఎల్లవేళలా శ్రమించే విప్రుడంటే అమ్మవారికి ఇష్టం ఎందుకు ఉండదు. ఇష్టపడడమే కాదు అటువంటి వారిలో నివసిస్తుంది. అందుకే " విప్రప్రియా, విప్రరూపా " అని కొలవబడుతూంది.
పరమాత్మ గీతలో బ్రాహ్మణుడి గురించి ఇలా తెలియచేసారు:
" శమో దమస్తపః శౌచం
క్షాంతిరార్జవమేవ చ,
జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం
బ్రహ్మకర్మ స్వభావజమ్ "
- భ.గీత 18:42
" శమము (ప్రశాంతత), దమము (ఇంద్రియ నిగ్రహం), తపస్సు, స్వచ్ఛత, సహనం, చిత్తశుద్ధి, జ్ఞానము, విజ్ఞానము, మరియు ఇహపరలోకములపై విశ్వాసము - ఇవి బ్రాహ్మణుల సహజసిద్ధ స్వభావ కర్మ లక్షణములు " అని.
ఈ గుణాలు ఉన్నవారే బ్రాహ్మణులుగా పరిగణింపబడుతారు.
" బ్రహ్మణ్యో బ్రహ్మకృద్ బ్రహ్మా
బ్రహ్మ బ్రహ్మవివర్ధనః ,
బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ
బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః "
- విష్ణుసహస్రం
బ్రహ్మజ్ఞానం కలవారు బ్రాహ్మణులు. " నేను బ్రాహ్మణప్రియుడను " అన్నారు పరమాత్మ.
కాని అందరూ విప్రులు కాలేరు. " ఆచరతి ఆచారయతి ఇతి ఆచార్యః " అన్నాయి శాస్త్రాలు. అంటే తను ఆచరిస్తూ అందరిచేతా ఆచరింపచేసేవారు ఆచార్యులు అవుతారు. లేకపోతే ఆయన నోటివెంట వచ్చే మంత్రానికి/వాక్కుకి శబ్దమే ఉంటుంది, శక్తి ఉండదు. ధర్మాన్ని ఆచరిస్తూ ఆచరింపచేసే అటువంటి విప్రులు ఎదురుగా కూర్చుంటే మహదానందపడిపోతుంది అమ్మవారు.
ఓ ఉదా: చూద్దాం. ఎవరైనా పి ఎం/సి ఎం సీటులో కూర్చోగానే చేసే పని కొందరు ఆఫీసర్లని తమ సెక్రటేరియట్ లో ప్రత్యేకంగా నియమించుకోవడం. మరి అందరూ సివిల్స్ లో ఉత్తీర్ణత పొందినవారే కదా. ఎవరైతే ఏమిటి. అంటే తన పద్ధతికి సరిపోయేలా తనపాలన, అనుకున్న కార్యక్రమాలూ సక్రమంగా జరగడం కోసం కొన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. ఎక్కడో విదేశాల్లో ఉన్నా కూడా ఆ ఆఫీసర్ని వెంటనే దగ్గరకు తెప్పించుకుంటారు. మరి 84 లక్షల జీవరాశులను కంటికిరెప్పలా కనిపెట్టుకుని చూసుకుంటూ సమస్తలోకాల్ని పాలించే అమ్మవారు తనపనుల సక్రమ జరుగుబాటు కోసం ధర్మాన్ని పాటిస్తూ పాటించేలాచేస్తూ శ్రమపడే ఇలాంటి " విప్రుల " ను ఏర్పాటుచేసుకున్నా , వారిని ఇష్టబడినా ఆశ్చర్యం ఏముంది.
ప్రతీ ఇంట్లోనూ శిశువు జన్మించినప్పటినుంచీ ప్రతీ శుభకార్యానికి వచ్చి నాలుగు మంత్రాలు చదివి, పూజలు వ్రతాలు చేయించి ఆకుటుంబాలు ఎప్పుడూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించే బ్రాహ్మణుడిని గౌరవించడానికి భేషజాలు పోనక్కరలేదు. వారుకూడా బాగుండాలని కోరుకోవడం అందరి కనీసధర్మం.
అమ్మవారిని మరుజన్మలోనైనా అటువంటి " విప్రులు " గా జన్మించే అవకాశాన్ని కలిగించమని ప్రార్ధిద్దాం. ఇప్పటినుంచీ ధర్మాన్ని మాత్రమే అనుసరిస్తూ జీవితాన్ని ధన్యమయం చేసుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య
శుభం భూయాత్
Comments
Post a Comment