అమ్మవారు భక్తులమీద అమృత వర్షం కురిపిస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" సుధాసారాభివర్షిణీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 106 వ నామం.

" సుధాసారాభివర్షిణీ " అంటే సుధా+ఆసార+అభివర్షిణీ - అమృతమును జడివానగా కురిపించునది అని భాష్యం చెప్పారు. 

కఠిన సాధనతో ఆరు చక్రాలను, మూడు ముడులను ఛేదించుకుని తన వద్దకు చేరిన సాధకుడిని చూసి వేయి దళాల పద్మంలో కూర్చుని ఉన్న అమ్మవారు మురిసిపోతారు. సాధకుడు " నేను " అనే భావన తొలగిపోయి బ్రహ్మానంద స్థితిలో ఉంటాడు. సాధారణంగా రకరకాల ఆనందాలు ఉంటాయి, ఒకదానికి మించి ఇంకో ఆనందం. బ్రహ్మానందం అంటే ఆ ఆనందానికి మించిన ఆనందం లేనిది.

అమ్మవారు ఎంతటి అమృతమూర్తి అంటే కఠిన సాధన చేసే జీవుడు తనదాకా రాకమునుపే మరణిస్తే అతని సాధన స్థాయిని బట్టి మణిద్వీపానికి తీసుకుని రావడమో లేక వేరే పుణ్యలోకాలకు పంపడమో చేసి వారిచేత సర్వభోగాలు అనుభవింప చేసి తొందరగా తరించగలిగే మరుజన్మను అనుగ్రహిస్తారు.

మిగతా జీవితమంతా అమ్మవారి సన్నిధిలో ఆనందంగా గడిపిన సాధకుడి ప్రాణవాయువు మరణించిన తరువాత సహస్రారంపై ఉండే బ్రహ్మరంధ్రం గుండా బయటకు వెడుతుంది. ఇదే కపాలమోక్షం.

బ్రహ్మరంధ్రాన్ని మాడు అంటారు. పుట్టినప్పుడు ఇది మెత్తగా ఉంటుంది. ప్రాణం దీనిలోంచే శరీరంలోకి ప్రవేశిస్తుంది. " నేను " అనే భావం మొదలవగానే ఈ మాడు గట్టిపడడం మొదలవుతుంది. మళ్ళీ ప్రాణం ఈ మాడు పగిలి పైకి పోవడమే కపాలమోక్షం.

పూర్వపు రోజుల్లో ఈ కపాలమోక్షం సర్వసాధారణం. ప్రస్తుతపు రోజులలో ఇది కనుమరుగయింది. మాయలోంచి బయట పడలేక పోవడమే కారణం.

ఈరోజు వారాహీదేవీ నవరాత్రుల చివరి రోజు. 

అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.

ఏతత్ సర్వం శ్రీవారాహీదేవీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ