నచ్చని వారిని విస్మరించడమే మంచిది - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" మైత్ర్యాది వాసనాలభ్య " - అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 570 వ నామం.
ఇక్కడ " మైత్రి " మొదలగునవి అంటే " మైత్రి, ముదిత, కరుణ, ఉపేక్ష " అని భాష్యం చెప్పారు భాస్కరరాయలు.
ఒక మనిషికి ఇంకో మనిషికి ఉన్న సంబంధాలు/తేడాలు 4 రకాలుగా ఉంటాయని చెబుతున్నాయి మన శాస్త్రాలు. ఒక మనిషి ఉన్నాడు అనుకుందాం. ఇంకో మనిషి ఇతనికన్నా ఎక్కువవాడు, తక్కువవాడు అవచ్చు, సమానుడు అవచ్చు, అతనికి ఇతనిమీద లేక ఇతనికి అతనిమీద శతృత్వభావం ఉండవచ్చు. ఇంతకన్నా వేరేలా ఉండే అవకాశమే లేదు.
" అశాంతస్య కుతః సుఖం ( భ.గీత 2:66 )" - ఎప్పుడూ అశాంతితో ఉండే వానికి సుఖం ఎక్కడిది - అన్నారు పరమాత్మ.
ఎవరికైనా కావలసినది సుఖమయ జీవితం. ఆఖరికి మరణంలో కూడా సుఖమరణాన్నే కోరుకుంటాడు. మరి శాంతిని పెంచుకుని సుఖం ని పొందాలంటే ఏమి చెయ్యాలో స్పష్ఠంగా చెప్పాయి శాస్త్రాలు.
అవి - 1. నీతో సమానమయిన వారితో స్నేహాన్ని ( మైత్రి ) పంచుకో. 2. నీకన్నా ఎక్కువవారిని చూసి సంతోషించు ( ముదిత ). 3. నీకన్నా తక్కువవారిపై జాలి ( కరుణ ) కలిగి ఉండు. 4. నీకు నచ్చని వారిని, నువ్వంటే ఇష్టం లేనివారిని ఆలోచనలలోంచి తొలగించు( ఉపేక్షించు ).
ఎంత అద్భుత విషయం. ఇలా చేయడానికి శ్రమ పడక్కరలేదు, బాధ పడక్కరలేదు. ప్రతీ మనిషి ఇలా ఆలోచనచేసి ప్రవర్తిస్తే ఇక సమస్య ఏముంటుంది. తనూ ఆనందంగా ఉంటాడు, తోటివారూ సంతోషంగా జీవిస్తారు. సదా చిదానందమే.
" సర్వే జనాః సుఖినోభవంతు " అని కోరుకోవడం అంటే ఇదే కదా.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment