అమ్మవారు భక్తులను చక్రవర్తిని చేస్తారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" సామ్రాజ్యదాయినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 692 వ నామం.
" సామ్రాజ్యదాయినీ " సామ్రాజ్యమును ఇచ్చునది అని భాష్యం చెప్పారు.
సామ్రాజ్యం అంటే ఏదో చిన్న రాజ్యం కాదు. మనం సామ్రాట్ అని వింటూంటాం. ఉదాహరణకు రాజసూయయాగం చేసిన వారిని సామ్రాట్ అంటారు. భూమండలంమీద ఎక్కడికయినా వెళ్ళవచ్చు యాగాశ్వం. ఏ రాజ్యంలో అయినా దాన్ని బంధిస్తే ఆ రాజుతో యుద్ధం చేసి గెలిచి గుర్రాన్ని విడిపించుకుంటూ ఎదరకు సాగాలి. చిన్న విషయం కాదు అమ్మవారి అనుగ్రహం పొందడం.
అమ్మవారి అనుగ్రహం ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించుకున్నప్పుడల్లా శ్రీ తాడేపల్లి రాఘవనారాయణశాస్త్రి గారిని తలుచుకుని నమస్కరించుకోవాలి. తాడేపల్లి రాఘవనారాయణశాస్త్రిగారి తండ్రి గారు వెంకటప్పయ్యశాస్త్రి, తల్లి శ్రీదేవి. రాఘవగారి చిన్నతనంలో వారి ఇంటికి ఓ సిద్ధపురుషుడు వచ్చారు. ఈపిల్లవాడిని చూసి వారి తండ్రితో " మీ పిల్లవాడికి బాలమంత్రాన్ని ఉపదేశిద్దాం అనుకుంటున్నాను, మీరు అనుమతిస్తే " అని అడిగి ఆయన అనుమతిని తీసుకుని " బాల " ను ఉపదేశించారు.
మరి శాస్త్రిగారు ఎన్నికోట్ల " బాల " జపం చేసారోకాని ఓరోజు జపం ముగించి కళ్ళు తెరిచేసరికి ఆయన ఒడిలో ఓ పాప కూర్చుని ఉంది. ఈయన ఆశ్చర్యపోయి " ఎవరి అమ్మాయివమ్మా నువ్వు " అని అడిగితే ఆ పాప " పిలిచావుగా, వచ్చాను, ఏమి కావాలో కోరుకో. చక్రవర్తిని చెయ్యనా, లేక అంతటి ఐశ్వర్యం ఇవ్వనా " అని అడిగేసరికి ఆయనకు విషయం అర్ధమయి " అవన్నీ నాకెందుకమ్మా, ఇప్పుడు వచ్చినట్లుగానే అప్పుడప్పుడు వస్తూండమ్మా, చాలు నాకు " అని కోరుకోగానే కిలకిలా నవ్వి అంతర్ధానమయారు అమ్మవారు.
ప్రహ్లాదుడు " నాకు ఏ కోరికలూ లేవు, నాకేమీ ఒద్దు మొర్రో " అని వేడుకున్నా ఆయన్ని ఓ మన్వంతరంపాటు భూలోకానికి చక్రవర్తిని చేసారు నృసింహస్వామి.
అమ్మవారు అలా అనుగ్రహిస్తారు అనన్యభక్తులను.
అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment