భేషజం కాదు, భక్తి/భావన ముఖ్యం - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" అనిత్యతృప్తా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 815 వ నామం.
" అనిత్యతృప్తా " అంటే నిత్యములు కాని ఉపచారాలతో సంతోషించునది. అటువంటి ఉపచారాలతో " కూడా " సంతోషించునది అని భావించాలి.
సాధారణంగా మనం చేసే పూజలో చేసే ఉపచారాలన్నీ అనిత్యాలే. సమర్పించే పూలు పళ్ళు నైవేద్యాలు పానీయాలు అన్నీ అనిత్యమే. ఏదీ రెండు మూడు రోజులకన్నా నిలవ ఉండవు. కాని ఏదో ఒకటి సమర్పించాలి అనే భక్తుల భావనకు అమ్మవారు తృప్తి చెందుతారు.
భక్తకన్నప్ప ఓ చేత్తో పూలు ఇంకో చేత్తో నైవేద్యం పట్టుకున్నాడు. మరి అభిషేకానికి నీరు ఎలా పట్టుకెళ్ళడం. నోటితో పట్టుకుని వెళ్ళి శివలింగం మీద ఊసాడు. అది తప్పని కన్నప్పకు తెలియదు. ఆ పూజకే మురిసిపోయి మోక్షాన్ని ప్రసాదించాడు శివుడు కన్నప్పకు.
పరమాత్మ గీతలో ఇదే తెలియచేసారు:
" పత్రం పుష్పం ఫలం తోయం
యో మే భక్త్యా ప్రయచ్ఛతి,
తదహం భక్త్యుపహృతమ్
అశ్నామి ప్రయతాత్మనః "
- భ.గీత 9:26
" నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకుగాని, ఒక పువ్వు గాని, ఒక పండు గాని, లేదా నీరైనా గాని సమర్పిస్తే, ఆ స్వచ్ఛమైన మనస్సుగల నా భక్తునిచే ప్రేమతో ఇవ్వబడిన దానిని, నేను సంతోషంగా ఆరగిస్తాను " అన్నారు పరమాత్మ.
" హరినామజపమే ఆభరణంబులు
పరమాత్ముని నుతి పరిమళము
ధరణిధరు పాదసేవే భోగము
పరమం బెరఁగిన ప్రపన్నులకు "
అని ప్రార్థించారు అన్నమాచార్యులు. భక్తుడే ఇలా తృప్తి పడితే పరమాత్మ ఎంత తృప్తి చెందుతారు.
" ఏక బిల్వం శివార్పణం " - ఒక బిల్వపత్రం లింగంమీద భక్తితో పెడితే చాలు మురిసిపోతారు స్వామి.
అన్నీ అమ్మవారే ఇచ్చినప్పుడు ఆవిడకు సమర్పించగలిగేది ఏముంటుంది.
ఏమీ కుదరనప్పుడు శ్రద్ధగా " (శివ)మానస పూజ " చేసుకోమన్నారు ఆదిశంకరులు.
భేషజం కాదు, భక్తి/భావన ముఖ్యం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment