అమ్మవారు కల్పన కాదు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" కల్పనారహితా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 858 వ నామం.
" కల్పనారహితా " అంటే తయారుచేయబడినది కాదు అని. అదంతా కల్పనండీ అంటూంటాం. కల్పన అంటే అబద్ధం, మాయ అనే భావనలో వాడుతూంటాం. కాని అది సరికాదు.
ఈ కల్పనలు/తయారీలు అన్నీ జీవుల పనులు. మనస్సు రకరకాల కల్పనలు చేస్తూంటుంది.
" వాసనామయ్యో దృశ్య వీచయః " అంది వేదాంతం. గతజన్మ వాసనలు తరంగాలు కలిగిస్తూ ఉంటాయి. గతజన్మ కర్మలను బట్టి సుఖ, దుఃఖ తరంగాలు ఒకటి తరువాత ఒకటి కలుగుతూనే ఉంటాయి.
అద్దం మీద మరక/మురికి ఉంటే మనరూపం సరిగ్గా కనబడదు. దోషం కన్నుది కాదు కదా. మనస్సు నిర్మలంగానే ఉంటుంది. కాని కర్మఫలాల వాసనలు మనస్సుకు తగులుకుంటాయి.
ఉదా:కు ఓ ధారావాహిక చూస్తూంటాం. దానిలో పాత్రలు, సంభాషణలు అన్నీ కల్పనలే అని తెలుసు. కాని తరువాత ఏమయిందో ఏమిటో అని మరునాడు అదే సమయందాకా ఒకటే ఆరాటం. కొన్ని పాత్రలపై జాలి, కొన్ని పాత్రలపై కోపం, అసహ్యం. ఇవన్నీ స్వయంకృతాలు. మనస్సు చేసే మాయలు. లేని విషయాలకోసం కూడా ఆనందం, విచారం, కోపం, ద్వేషం.
ఇటువంటి అలజడిలేని మానసిక స్థితే కల్పనారహితం, అమ్మవారు. శుద్ధమయిన మనస్సులో అమ్మవారు కొలువై ఉంటారు.
" తన్మే మనః శివసంకల్పమస్తు - సంకల్పసూక్తం " - మా మనసుల్లో ఎప్పుడూ మంచి ఆలోచనలే కలిగించు తల్లీ అని అమ్మవారిని వేసుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment