శ్రీశ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" కృష్ణం వందే జగద్గురుం - ఏకో దేవో దేవకీ పుత్రః " శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణాష్టమి. స్వామి అవతరించిన రోజు. స్వామిని ధ్యానించుకుని తరిద్దాం.
పరమాత్మే స్వయంగా తెలియచేసారు గీతలో " పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం, ధర్మసంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే ( భ.గీత 4:8 )" అని. ధర్మసంస్థాపన కోసమే స్వామి అవతారం స్వీకరించినది.
ఇక్కడ " సంభవామి " అన్నారు పరమాత్మ. విష్ణుసహస్రనామాలలో " సంభవః " అని ఒక నామం. " స్వేచ్ఛయా సమీచీనం భవనం అస్యేతి సంభవః " - స్వేచ్ఛగా సంపూర్ణంగా కలుగుతారు అని. భవః అంటే కలుగుట/పుట్టుట. మన పుట్టుకలు, మరణాలు మన చేతిలో ఉండవు. స్వామి అవతార ప్రారంభం, పరిసమాప్తి ఆయన అధీనంలోనే ఉంటాయి, అవతారం సంపూర్ణంగా ఉంటుంది. అందుకే స్వామిది సంభవం.
" నతస్య ప్రాకృతామూర్తిః " - ఆయన మూర్తి ప్రాకృతములు కాదు. అంటే పంచభూత వికారములతో కూడిన దేహము కాదు. అప్రాకృతిక దివ్యమంగళవిగ్రహం కృష్ణుడిది. పుట్టినప్పుడే చతుర్భుజాలతో, శంఖ చక్ర గదా పద్మాలతో దర్శనమిచ్చారు దేవకీ వసుదేవులకు.
కృష్ణుడు చిన్నతనంలోనే ఎన్నో లీలలు ప్రదర్శించారు. రాక్షసులను చంపారనుకుంటాం, తప్పు, వారికి ముక్తిని ప్రసాదించారు అన్నది నిజం. భాగవతంలో ఓ అద్భుత ఘట్టం ఉంది.
పూతన రాక్షసి. బాలకృష్ణుడిని చంపడానికి వచ్చి ఆయనచేతిలో మరణించింది. భారీకాయం. ఎందరినో మనుషులను, జంతువులను తిని ఉంటుంది. శరీరమంతా విషం పేరుకుపోయి ఉంటుంది. ఎలా వదుల్చుకోవాలి. నందుడు ఆ శరీరాన్ని చిన్న చిన్న ముక్కలుగా నరికించి ఊరుకు దూరంగా దహనానికి ఏర్పాటు చేసాడు.
ఆశ్చర్యకరంగా దహనమవుతూన్న పూతన శరీరంనుంచి మంచిగంధం, సుగంధద్రవ్యాలు కాలుస్తూన్నట్లు చక్కటి సువాసన వస్తూంది.
భాగవతం వింటూన్న పరీక్షిత్తు ఆశ్చర్యపోయి " అదెలా సాధ్యం మహర్షీ, పూతన పాపాత్మురాలు, రాక్షసి, శరీరం దహనం అవుతూంటే పుణ్యాత్ములకు లాగ చక్కటి సువాసనలు ఎలా వచ్చాయి " అని అడుగుతాడు శుకమహర్షిని.
" పూతన కృష్ణుడిని ఒడిలో కూర్చోపెట్టుకుంది. కృష్ణుడు చేతితో పూతనను తాకారు. తాకగానే పూతన జన్మజన్మల పాపం పూర్తిగా నశించింది. పూతన శరీరం పరమపవిత్రమయి పోయింది. దహనమవుతూంటే అటువంటి సువాసనలు రావడంలో ఆశ్చర్యం ఏముంది " అంటారు శుకమహర్షి.
స్త్రీలను వృక్షాలను గౌరవించాలన్నారు. సుఖమయ జీవితానికి అద్భుతము, నిత్యనూతనము అయిన గీతను ప్రసాదించారు.
గోపికలు, గోపబాలకులతో సహా ఎందరికో ముక్తిని ప్రసాదించారు కృష్ణపరమాత్మ.
శ్రీశ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు అందరికీ.
ఏతత్ సర్వం శ్రీశ్రీకృష్ణార్పణమస్తు - సూర్య
శుభమస్తు
Comments
Post a Comment