జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడమే విజ్ఞానం - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" విజ్ఞానకలనా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 902 వ నామం.
" విజ్ఞానకలనా " అంటే విజ్ఞానాన్ని కలిగించునది అని అర్థం. కలనా అంటే కలిగించునది అని.
వేదం, శాస్త్రాలు అమ్మవారి నిలయం. అవి జ్ఞానంని ఇస్తాయి. ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడమే విజ్ఞానం.
గీతలో పరమాత్మ జ్ఞానం, విజ్ఞానం గురించి విడివిడిగా రెండు అధ్యాయాలలో తెలియచేసారు.
ఓ ఉదాహరణ చూద్దాం. కారును నడపడం అంటే స్టార్ట్ చేయడం, గేరు ( ఉంటే ) వేయడం, యాక్సిలేటర్ నొక్కడం, ఎదరకి పోవడం, అవసరమయితే బ్రేకు నొక్కడం. ఇది పుస్తక జ్ఞానం. మరి అలా కారులో వెళ్ళిపోవచ్చా?. అంటే కుదరదు. చిక్కుల్లో పడతాం, ప్రాణాలు కూడా పోవచ్చు.
నడపడం నేర్పే గురువును పట్టుకోవాలి. 7/10 రోజులు ఆయన చెప్పినట్టు చేస్తూ నడపడం నేర్చుకోవాలి. అప్పుడు విజ్ఞానం/నేర్పరితనం వస్తుంది. ప్రయాణం సాఫీగా సాగుతుంది.
శాస్త్రజ్ఞానం పొందాక దాన్ని ఆచరణలో పెట్టాలి. అప్పుడే జీవితం ఒడిదుడుకులు లేకుండా ఆనందదాయకంగా సాగుతుంది.
సూర్యుడు వెలుగు ఇస్తున్నారు అనుకుంటాం. కాని వెలుగే ఆయన. అలాగే అమ్మవారు విజ్ఞానాన్ని కలిగిస్తారు అంటే విజ్ఞానమే అమ్మవారు.
అమ్మవారు ప్రసాదించే విజ్ఞానం యొక్క అద్భుతం చూడాలంటే ఓ పక్షి గూడు గమనిస్తే తెలుస్తుంది. పెద్దగా చదువుకోనివారు కూడా అద్భుత పాలన చేస్తూంటారు, అద్భుత వ్యాపార దక్షతను కలిగి ఉంటారు. సంగీతజ్ఞానం లేనివారు అద్భుతంగా పాడుతూ ఉంటారు.
జ్ఞానం విజ్ఞానం వేరు వేరు అని ప్రతిపాదించినది మన సనాతనధర్మం. అదీ మన ఋషుల విశిష్టత.
అటువంటి విజ్ఞానాన్ని ప్రసాదించి అందరి జీవితాలను సుఖమయం చేయమని అమ్మవారిని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment