అమ్మవారు ఆనందాన్ని అనుగ్రహిస్తారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" శర్మదా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 953 వ నామం .
" శర్మదా " సుఖమును ఇచ్చునది. అసలు సుఖం అంటే ఏమిటి?
జీవితం హాయిగా ఆనందంగా ఏ బాధలూ లేకుండా గడిచిపోవాలని కోరుకుంటారు ఎవరయినా. సుఖాలు లేకపోయినా పరవాలేదు, బాధలు ఉండకూడదు అనుకుంటారు. ఆఖరికి మరణంలో కూడా ఏ బాధలూ ఉండకూడదు అని కోరుకుంటాం.
" అనాయాసేన మరణం
వినాదైన్యేన జీవనం
దేహాంతే తవ సాయుజ్యం
దేహిమే పరమేశ్వరా "
ఎవరిమీదా ఆధారపడకుండా జీవించడం, అనాయాసంగా మరణించడం, మరణం తరువాత భగవసన్నిధికి చేరడం చాలా కష్టం. అదే అసలయిన సుఖం. దానిని అమ్మవారు తనను నమ్ముకున్నవారికి ప్రసాదిస్తారు.
మూక శంకరులు స్తుతిశతకంలో ఇలా ప్రార్థిస్తారు కామాక్షీదేవిని:
" ధనేన న రమామహే.....
.........చరణపల్లవోపాసనాం "
- శ్లోకం 85
" అమ్మా మాకు ధనమున సంతోషం కలుగదు. దుర్మార్గులను సేవించు చాపల్యం పొందము. సంసారభయం లేదు. ఎందుకంటే నీ పాదాలను స్ధిరంగా పూజిస్తున్నాం కదా " అని.
అందరం అమ్మవారి పాదాలను ఆశ్రయించి అటువంటి సుఖమును ప్రసాదించమని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment