అమ్మవారు సంసార బాధలను తగ్గిస్తారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" భవరోగఘ్నీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 842 వ నామం .
" భవరోగఘ్నీ " అంటే సంసారమనెడి రోగమును పోగొట్టునది.
భవ అంటే సంసారం. ఇక్కడ భవరోగం అన్నారు. అంటే సంసారం పూర్తిగా ప్రక్కన పెట్టనక్కరలేదు అనుకోవాలి. ఏ రోగానికి అయినా మందు ఉంటుంది, నయమవడానికి. సంసారంని రోగంలా భావించి జాగ్రత్త పడమని.
మూక శంకరులు స్తుతిశతకంలో ఇలా ప్రార్థిస్తారు:
" నతానామ్మదానాం..... స్మరమధనజీవాతుకలికాం "
" సంసారపు సంకెలలో కట్టుబడుటచేత వ్యాకులత చెంది బుద్ధి మందగించినవారు నమస్కరించినంత మాత్రమునే వారి అజ్ఞానమను చీకటిని తొలగిస్తున్నావు కదమ్మా " అని
ఇక్కడ అర్ధం చేసుకోవలసినది సంసారం ఆనందదాయకంగా, ఆకర్షణీయంగా ఉండేలా చూస్తారు అమ్మవారు. సంసారబాధలతో సతమతమయే వారికి మాత్రం చికిత్స చేస్తారు.
అగ్నిద్యోతనుడికి లేఖ ఇచ్చి కృష్ణపరమాత్మకి ఇవ్వమని పంపించింది రుక్మిణీదేవి. లేఖలో విదర్భకు వచ్చి తనను తీసుకుని వెళ్లి వివాహం చేసుకోమని కోరింది. అదెలా కుదురుతుంది, పిలవనిపేరంటం, బావుండదేమో అనలేదు పరమాత్మ. విదర్భ వచ్చారు, రధం మీద రుక్మిణీదేవిని తీసుకుని వెడుతూ అడ్డువచ్చిన వారిని ఓడించి మరీ రుక్మిణీదేవిని వివాహం చేసుకున్నారు. అంత ఆకర్షణ ఉంది వివాహం/సంసారంలో.
ప్రతీ సుఖానికి దుఃఖస్పర్శ, ప్రతీ దుఃఖానికి సుఖస్పర్శ ఉంటుంది భూలోకంలో. సమస్యలకి కృంగిపోకూడదు. అమ్మవారి నామజపం చేసుకుంటే అన్నీ ఆవిడే చూసుకుంటారు.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment