అమ్మవారు ధ్యానంతోనే పొందగలుగుతారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" ధ్యానగమ్యా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 641 వ నామం .
" ధ్యానగమ్యా " అంటే మాటిమాటికీ ధ్యానముచేతనే పొందదగినది అని అర్ధం.
ధ్యానం అంటే మనస్సును అదుపులో ఉంచుకోవడం. అది అంత సులభం కాదు. మనస్సు సంకల్పవికల్పాలు రెండూ చేస్తూ మాయ చేస్తుంది.
పరమాత్మ గీతలో ఇలా అంటారు:
" అథ చిత్తం సమాధాతుం
న శక్నోషి మయి స్థిరం !
అభ్యాసయోగేన తతో
మామిచ్ఛాప్తుం ధనంజయ"
- భ.గీత 12:9
మనస్సును సుస్థిరముగా నాయందే నిల్పుటకు సమర్ధుడవు కానిచో అర్జునా, అభ్యాసయోగముద్వారా నన్ను పొందుటకు ప్రయత్నింపుము.
అభ్యాసం అంటే భగవంతుని నామగుణముల శ్రవణం, కీర్తనం , మననం, అట్లే శ్వాసద్వారా జపము, భగవత్ప్రాప్తికి సంబంధించిన శాస్త్రముల పఠనం మొదలగు క్రియలను భగవత్ప్రాప్తికై మాటిమాటీకి చేయుటనే అభ్యాసము అంటారు.
త్యాగయ్య 96 కోట్ల రామజపం చేసారంటే ఆశ్చర్యం వేస్తుంది. కాని మొదలుపెట్టి చేయగా చేయగా అదే వ్యాపకం అయిపోతుంది. వేరే ధ్యాసే ఉండదు.
అలా చేయడానికి అమ్మవారి అనుగ్రహం కావాలి. అమ్మవారి పాదాలను ఆశ్రయించి అటువంటి శక్తిని ప్రసాదించమని కోరుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment