ఈ రోజు " మిత్రుల దినోత్సవం " - శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" మిత్రరూపిణి " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 565 వ నామం.
మిత్రరూపిణి అంటే స్నేహానికి ప్రతిరూపం. మంచి స్నేహితుడు ఒక వరం.
" ఉపకారఫలం మిత్రం
విదితం మే మహాకపేః "
రామసుగ్రీవులు అగ్నిసాక్షిగా మైత్రీబంధం ఏర్పరుచుకున్నాక రాముడు సుగ్రీవుడిని అడుగుతారు " నేను నీకు ఏవిధంగా సహాయపడగలను " అని. రాముడు సీతమ్మను వెదుకుతూ సుగ్రీవుడి దగ్గరకు వచ్చారు. రాముడు " నాకు ఈ సహాయం చెయ్యి " అని అడగాలి. కాని రాముడు అలా అడగలేదు. నీకు ఏమి సహాయం కావాలి అని అడిగారు. అదీ ఉత్తమ స్నేహితుడి లక్షణం. అంతేకాని ఎప్పుడూ " నాకు ఏమిస్తావు " అన్నట్లుగా ఉండకూడదు.
స్నేహితుడి లక్షణాలను భర్తృహరి 6 విధాలు అని తెలియచేసారు. అవి 1. పాపం చెయ్యకుండా ఆపడం 2. ఏది మంచి చేస్తుందో అది చేయించడం 3. రహస్యాలు ( మిత్రుడివి ) కాపాడడం 4. మంచిగుణాలను అందరికీ చెప్పడం 5. ఆపదల్లో విడవకుండా తోడుగా ఉండడం 6. ఎప్పుడు ఏది అవసరమో అది ఇవ్వడం.
స్నేహితుల మధ్య ఇంతకన్నా మించిన పరస్పర సహకారం ఏమీ ఉండదు. స్నేహం అనేది ఏకవచనం కాదు. ఎప్పుడూ బహువచనమే. కనీసం ఇద్దరు ఉండాలి స్నేహం ఏర్పడడానికి. మంచి స్నేహితుడు దొరకడం అనేది అదృష్టం మీద కూడా ఆధారపడి ఉంటుంది. సత్పురుషులకి ఎప్పుడూ మంచి స్నేహితులే ఉంటారు. రాముడికి సుగ్రీవుడు, కుచేలుడికి అర్జునుడికి శ్రీకృష్ణుడు వంటివారు దొరుకుతారు. అలాంటి స్నేహితులు దొరకాలంటే అమ్మవారి అనుగ్రహం తప్పనిసరి.
అమ్మవారిని నమ్ముకుంటే చక్కటి స్నేహితులని ప్రసాదిస్తారు. జీవితం ఆనందదాయకంగా ఉంటుంది.
ఈ రోజు " మిత్రుల దినోత్సవం " - శుభాకాంక్షలు అందరికీ.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment