క్షోభ/కదలిక ముఖ్యం మనిషికి - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" క్షోభిణీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 466 వ నామం .
" క్షోభిణీ " అంటే సృష్టి చేయుటకై భగవంతునియందు క్షోభను కలిగించినది అని అర్ధం చెప్పారు. క్షోభ అంటే కదలిక.
శ్రీ బాలాత్రిపురసుందరీదేవికి అష్టోత్తర శతనామావళి పూజ చేస్తూ అమ్మవారిని " ఓం సర్వసంక్షోభిణ్యైనమః " అని పూజిస్తాం. మంచి కదలికలను కలిగిస్తుంది తల్లి.
విష్ణుసహస్రంలో క్షోభణః అని ఒక నామం. దానికి సృష్టికాలమునందు కల్లోలము కలిగించువాడు అని భాష్యం చెప్పారు ఆదిశంకరులు.
మనిషికి ఈ కదలిక చాలా ముఖ్యం. కదలిక లేకపోతే ఉత్సాహం ఉండదు. అసలు జీవితానికి అర్ధమే ఉండదు. కదలిక లేకుండా పడుకుని ఉంటే అతనికే కాదు, అతని సంబంధించిన వారికందరికీ నరకమే.
" యోజనానాన్ సహస్రాణి
యాతిగచ్ఛన్ పిపీలికాః,
అగచ్ఛన్ వైనతేయో2పి
పదమేకం నగచ్ఛతి "
" నడక మొదలెడితే చీమలు కూడా వ్రేలమైళ్ళు వెడతాయి కాని మొదలుపెట్టకపోతే గరుత్మంతుడు కూడా ఒక్కడుగు ( పదమేకం ) కూడా వెళ్ళలేడు
" అని తెలియచేస్తూంది సుభాషితం.
క్షోభని బాధకు బదులుగా వాడుతూంటారు సాధారణంగా. క్షోభ పెట్టకండి అంటూంటారు. ఎవరయినా సమస్యలో ఉంటే వారిని క్షోభ పెట్టకండి అంటే కదలించకండి అంటాం. బాధలో ఉన్నప్పుడు బాగా దుఃఖిస్తే మనసు తేలిక పడుతుంది అంటారు. అంటే కదలిక మనస్సును తేలికపరుస్తుంది. సున్నిత మనస్కులు తొందరగా తేలిగ్గా కదలిపోతారు.
శంకరులు దేవీఅపరాధక్షమాస్తోత్రంలో " తదపిచ నజానే విలపనం - నాకు ఏడవడం కూడా రాదమ్మా ", నువ్వే అనుగ్రహించాలి అని ప్రార్థిస్తారు.
దీనికో చిన్న కధను చెబుతారు. గొంగళీపురుగు గూడు కట్టుకుంది సీతాకోకచిలుకగా మారడానికి. గూడు కొద్దిగా చిట్లింది, అది బయటకు రావడానికి చాలా కష్టపడుతూంది. ఒకాయన అది చూసి అయ్యో పాపం అని గూడు మెల్లిగా కత్తిరించి దానిని బయటకు లాగాడు. అది దానికి శాపం అయింది. రెక్కలు గట్టిపడాలంటే పురుగు పెనుగులాడాలి, రక్తప్రసరణ బాగా జరగాలి. అది కష్టపడి గూడును ఛేదించుకుని బయటకు రావాలి కాని ఇలా ఇతరుల సహాయంతో కాదు. జాతి మనుగడకయినా ఇది ముఖ్యం. ఉచితంగా ఇస్తే జాతి/దేశం నిర్వీర్యమవుతుంది.
భౌతిక మానసిక క్షోభ/కదలిక మనిషికి అత్యవసరం.
ఈ కదలికను అమ్మవారు అనుగ్రహిస్తారు. మరణించే వరకూ కూడా ఈ కదలికను అనుగ్రహించమని అమ్మవారిని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment