అందరికీ ఆసరా అయిన అమ్మవారికి ఆసరా దేనికి?- చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" నిరాలంబా " - అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 877వ నామం.
నిరాలంబా అంటే వేరొక ఆధారం లేనిది. జగత్తుకు అమ్మవారు ఆధారం. మరి అమ్మవారికి ఏమిటి ఆధారం. ఏమీలేదు, అవసరమూ లేదు.
సాధారణంగా అతనికి ఏ ఆధారం లేదండీ అని ఎవరయినా అనగానే " అయ్యో పాపం " అంటాం. కాని ఏ ఆధారం లేకుండా జీవించడం ఒక గొప్ప విషయం. ఎంతో ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ కూడా " ఆలంబన " ఉంది. అతని ఆత్మవిశ్వాసమే అతనికి ఆలంబన.
ఏపని చేయాలన్నా ఆఖరికి పూజ/ధ్యానం చేయాలన్నా ఆలంబన అవసరం. ధ్యానం చేసేటప్పుడు కూడా ఒక మూర్తినో లేక శ్వాసనో ఆలంబనంగా చేసుకుంటాం. లేకపోతే మనస్సు నిలవదు. విగ్రహారాధన దీనికోసమే ఏర్పాటు చేశారు మన ఋషులు. వారికి పనీ పాటా లేకకాదు.
ఎవరికయినా ధనం దానం చేసాం. ధనాన్ని మనం సృష్టించామా. ఇంకొకరి నుంచి రావలసిందే. ఆ ఇంకొకరికి ఇంకొకరినుంచి రావాలి. అదే ఆలంబన.
ఇలా ఆ ఆలంబనకు ఆలంబన ఏమిటి అని వెతుకుతూ ఉంటే చివరకు అమ్మవారి దగ్గర ముగుస్తుంది. ఎందుకంటే అమ్మవారికి ఆలంబన లేదు, అవసరం లేదు కనుక.
ఇదే విషయాన్ని పరమాత్మ కూడా తెలియచేసారు:
" అనన్యాశ్చింతయంతో
మాం ఏజనాః పర్యుపాసతే,
తేషాం నిత్యాభియుక్తానాం
యోగక్షేమం వహామ్యహం "
- భ.గీత 9:22
నన్ను నమ్ముకున్న ( ఆలంబనగా చేసుకున్న ) వారి యోగక్షేమాలు నేను చూసుకుంటాను అన్నారు పరమాత్మ. అలా చూసుకున్నారు కూడా - ద్రౌపది, గజేంద్రుడు మొ.గు వారిని.
అమ్మవారిని మించిన ఆలంబన మనకు ఏముంటుంది. ఆవిడ పాదాలను ఆశ్రయిద్దాం అందరం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment