మంచి సంకల్పానికి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" దీక్షితా " - అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 695 వ నామం.
" దీక్షితా " అంటే దీక్షగలది, జ్ఞానమును గలిగించు దీక్షగలవాని స్వరూపముగలది అని భాష్యం చెప్పారు.
దీ అంటే జ్ఞానం. క్ష అంటే పాపక్షయం. ఈ రెండూ ఉన్నవారిని దీక్షితులు అంటారు. వీరికి కొన్ని కట్టుబాట్లు, బాధ్యతలు ఉంటాయి. ముఖ్యంగా నియమాలు ఉంటాయి.
దీక్ష అంటే సంకల్పం. ఏదైనా పని లేక కోరిక తీరడం కోసం దీక్ష తీసుకుంటారు. ఉదా: నిరాహారదీక్ష చేస్తారు. కాలక్షేపం కోసం కాదు. దానికి ఓ కారణం ఉంటుంది.
వీరు గురువు దగ్గర దీక్ష తీసుకుంటారు. అయ్యప్పస్వామిదీక్షను గురుస్వామి దగ్గర తీసుకుంటారు. నేరుగా మాల వేసుకోకూడదు. వీరికి కొన్ని రక్షణలు కూడా ఉంటాయి. మైల, పురుడు మొ.గు అశుచులు వీరికి అంటవు. దీక్షాకాలం ముగిసే వరకు. కాల నియమం కూడా ఉంటుంది. అయ్యప్ప దీక్ష అయితే నలభై రోజులు, చాతుర్మాస్య దీక్ష అయితే నాలుగు నెలలు దీక్షలో ఉంటారు. ఆ సమయంలో ఆహార నియమాలు, నడవడిక నియమాలు, ప్రత్యేక వస్త్రధారణ కలిగి ఉంటారు. దైవ నామస్మరణ చేసుకుంటూ మితభాషిగా ఉంటారు.
దీక్ష సమయంలో పరుషభాష ఉపయోగించకపోవడం, ఇతరులకు హాని కలిగించకపోవడం, మనస్సులో కూడా ఇతరులకు హాని కలగాలని కోరుకోకపోవడం చేస్తారు. దీక్షలో ఉన్నవారు ఎవరయినా చేతనైన సహాయం చేయండి అని అడిగితే నాకు సమయంలేదు, వీలుకాదు అని చెప్పకూడదు అని శాస్త్రం చెబుతూంది.
అందుకే దీక్షలో ఉన్నవారిని అమ్మవారు ఇష్టపడుతారు, అనుగ్రహిస్తారు.
అలా అని ప్రతీ దీక్షనీ ఇష్టపడరు. ఉదా: ఏడాదిలోనే కొన్నివేల కోట్ల ప్రభుత్వ/ప్రజా ధనాన్ని కొల్లగొట్టాలని దీక్ష పడితే దహనానికి అవయవాలు కూడా దొరక్కుండా చేస్తారు. అమ్మవారు అవ్యాజకరుణామూర్తియే కాదు మహాకాళి కూడా. తస్మాత్ జాగ్రత.
అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని కోరుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment