ఋషి పంచమి నేడు, శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

ఋషి పంచమి నేడు. సప్త ఋషులను పూజించుకునే రోజు. ఇది స్త్రీలు చేసుకునే వ్రతం. ఉపవాసంతో రెండురోజుల కార్యక్రమం. ఇది చేయడానికి ముందు లక్షవత్తుల వ్రతం చేయాలి అని చెబుతారు.

ఋషి అంటే ఎవరు?

" ఋషివ్యవస్థ " అంటే పరమాత్మ ఇచ్చిన సందేశాన్ని/విజ్ఞానాన్ని లోకానికి అందించే ఏర్పాటు. మన ఋషులు ఏదిచేసినా ఏదిచెప్పినా లోకకళ్యాణాన్ని దృష్టిలో ఉంచుకునే. 

రామాయణంలో 27 రకాల ఋషుల వివరణ ఉంది. 27 ఋషులుకాదు, 27 రకాల ఋషులు. కొందరు నీరునుమాత్రమే తీసుకుంటూ, కొందరు గాలిని మాత్రమే తీసుకుంటూ, కొందరు గాలిలో తేలుతూ, కొందరు సూర్యరశ్మినే అహారంగా తీసుకుంటూ ఇలా అనేక ఋషులు లోకకల్యాణం కోసం తపస్సు చేస్తున్నారు అని తెలియచేసారు.

భరద్వాజ మహర్షి మహా తపస్సంపన్నుడు. ఓ సారి ఆయన వేదపఠనం చేస్తూంటే ఇంద్రుడు వచ్చి ఎంతవరకూ వచ్చింది మీ పఠనం అంటే మహర్షి ఈ జన్మ సరిపోదు అనడంతో ఇంద్రుడు మహర్షికి ఇంకో 300 సం.ల వయస్సు ఇచ్చాడు. అలా 3 సార్లు అంటే 900 సం.ల వయస్సు ప్రసాదించి మళ్ళీ వచ్చి అయిందా అంటే మహర్షి హిమాలయపర్వతాన్ని చూపెట్టి వేదం ఆ పర్వతం అయితే నేను నేర్చుకున్నది ఇది అని " గుప్పెడు ఇసుక " తీసి చూపించారు మహర్షి. " అనంతావై వేదాః " అన్నారు అందుకే. 

పదాల అర్ధం గ్రహించడమే కష్టం. ఒక్కో పదానికి ఎన్నో అర్ధాలు. యజుర్వేదంలో " నా తస్య ప్రతిమ అస్తి " అని ఉంది. శారదాపీఠం ఉత్తరపీఠాధిపతులు అనుగ్రహభాషణం చేస్తూ " ఈ వాక్యం చదివి మీ దేముడికి విగ్రహం లేదని మీ వేదంలోనే ఉందికదా అంటూంటారు కొందరు. కాని ప్రతిమ అంటే విగ్రహం కాదు, పోలిక. అంటే పరమేశ్వరుడితో పోల్చదగినవాడు లేడు అని అర్ధం " అని తెలియచేసారు. 

అంత అద్భుతం మన వేద వాజ్మయం.

మమ్మల్ని వేదాలను చదవనీయరా, వేదాలు ఒక వర్ణానికే పరిమితమా అని కొందరు బాధపడడం, ప్రశ్నించడం చూస్తూంటాం, వింటూంటాం.

" అన్నప్రాశన నాడే ఆవకాయ అన్నమా " అని సామెత. ముందు రామాయణం, మహాభారతం, భాగవతాలు చదివి మనం కొంచెం జ్ఞానం పెంచుకుంటే తరువాత వేదాల గురించి ఆలోచించవచ్చు.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభమస్తు

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ