అమ్మవారి వైభవానికి లోటేముంటుంది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" ఉద్దామవైభవా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 849 వ నామం. 

" ఉద్దామవైభవా " అంటే హద్దులేని వైభవము గలది. అమ్మవారి వైభవానికి లోటేమిటి.

కొత్తగా పాలకుడు అయి, పూర్తికాలం పదవిలో ఉంటాడో లేడో తెలియని నాయకుడి వైభవం చూస్తేనే ఆశ్చర్యం వేస్తుంది. కోట్ల విలువైన నివాసభవనం, లక్షల విలువైన వాహనాలు, రక్షణ సిబ్బంది, వందిమాగధులు, ప్రత్యేక విమాన సౌకర్యం. 

మరి అమ్మవారు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి. శాశ్వతేశ్వరి. ఆవిడ పొందిందీ లేదు, పొందబోయేదీ లేదు. తనను నమ్ముకున్న వారికి ఇవ్వలేనిదీ లేదు. మరి అటువంటి అమ్మవారి వైభవంని అసలు ఊహించశక్యమా.

ఆదిశంకరులు సౌందర్యలహరి ప్రార్ధన చేస్తూ ఇలా అంటారు:

" కిరీటం వైరించం పరిహర 

  పురః కైటభ భిదః,

  కఠోరే కోటీరే స్ఖలసి జహి 

  జమ్బారి మకుటం,

  ప్రణమ్రే ష్వేతేషు ప్రసభ 

  ముపయాతస్య భవనం,

  భవ స్యాభ్యుత్థానే తవ 

  పరిజనోక్తిర్వి జయతే "

అమ్మవారు మణిద్వీపంలో కూర్చుని ఉన్నప్పుడు శివుడు వచ్చారుట. భర్త కదా, అమ్మవారు లేచి హడావుడిగా వెళ్ళబోతూంటే పరిచారికలు " జాగ్రత్తమ్మా చూసుకుని వెళ్ళండి " అన్నారుట. ఎందుకంటే బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మొ.గు వారు అమ్మవారి పాదాల వద్ద కూర్చుని శిరస్సులు వంచి నమస్కరిస్తున్నారు. మరి బరువైన వారి కిరీటాలు తగిలితే అమ్మవారి పాదాలు నొప్పి చెందుతాయి కదా. అందుకని కాస్త చూసుకుని వెళ్ళమంటున్నారు పరిచారికలు. అలా ఉంటుంది అమ్మవారి వైభవం. 

బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు వంటివారి సేవలు అందుకుంటూన్న అమ్మవారిని కళ్ళుమూసుకుని ఊహించుకుంటూ ధ్యానం చేస్తే మనస్సు పవిత్రమవుతుంది. ప్రశాంతత లభిస్తుంది.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ