అమ్మవారు ఆనందాన్ని అనుగ్రహిస్తారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏" శ్రీమాత్రేనమః "🙏
" సుఖకరీ " అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 968 వ నామం.
సుఖకరీ అంటే సుఖమును కలిగించేది, ఇచ్చేది అని. ఏది ఆనందాన్నిస్తుందో అది సుఖం.
విష్ణుసహస్రంలో స్వామిని " సుఖదః " అని పూజిస్తాం. సుఖమునొసగువారు అని అర్ధం.
ఏ జీవి అయినా తన జీవితం ఆనందంగా గడిచిపోవాలనే కోరుకుంటుంది. చివరకు మరణంలో కూడా సుఖాన్నే కోరుకుంటాడు మనిషి. " అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవనం....." - ఇదే కదా ఎవరైనా కోరుకునేది.
" ఖం " అంటే ఆకాశం అంటే వెలుగు. దానికి సు చేరిస్తే సుఖం. అంటే మంచి ఆలోచనలు కలిగి మంచిపనులు చేస్తూ ఉంటే ఆనందంగా గడుస్తుంది. దుః కలిపితే దుఃఖం. చెడు ఆలోచనలు చేస్తూ చెడుపనులు చేస్తూ ఉంటే జీవితం బాధగా గడుస్తుంది. ఒక అక్షరం మన జీవితాన్ని మార్చేస్తుంది. ఏ అక్షరం కలుపుకోవాలి అనేది మన చేతుల్లోనే ఉంది.
" అశాంతస్య కుతః సుఖం (భ.గీత 2:66)" అన్నారు పరమాత్మ. ఎప్పుడూ అశాంతితో ఉండేవారికి సుఖం ఎక్కడిది.
త్రిగుణాలప్రభావం వల్ల ప్రకృతి/సమాజం మాయ చేస్తుంది. మోహంలో పడేస్తుంది. మనల్ని మనంగా బ్రతకనివ్వదు. మరి ఏమిచెయ్యాలి?.
అందుకే అమ్మవారి పాదాలను ఆశ్రయించాలి. " తన్మే మనః శివసంకల్పమస్తు " - సంకల్పసూక్తం - " అమ్మా మామనసుల్లో ఎల్లప్పుడూ మంచి సంకల్పాలే కలిగేటట్లు అనుగ్రహించు " అని కోరుకోవాలి. కోరుకోవాలేకాని అనుగ్రహించకుండా ఎలా ఉంటారు అమ్మవారు. అవ్యాజకరుణామూర్తి.
భోగాభిలాషను పెద్దపెద్ద కోరికలను దూరం పెడితే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. దుఃఖం కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంది.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment