" శ్రావణ పౌర్ణమి - హయగ్రీవ జయంతి - జంధ్యాల పౌర్ణమి " శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ
" శ్రీమాత్రేనమః " 🙏 హయగ్రీజయంతి
" శ్రావణ పౌర్ణమి - హయగ్రీవ జయంతి - జంధ్యాల పౌర్ణమి "
అమ్మవారు శ్రీలలితాదేవి మణిద్వీపంలో సింహాసనాధీశురాలై కొలువై ఉంటారు. దుర్గాసూక్తంలో అమ్మవారిని " తాం అగ్నివర్ణాం " అని పూజిస్తాం. ఆవిడ అగ్నిరంగులో ( ఎరుపు పసుపు కలిసిన రంగులో ) మెరిసిపోతూ ఉంటుంది. ఆవిడకి ఎప్పుడూ 16 ఏళ్ళ వయస్సే. అందుకే ఈ సృష్టి ఇంత అద్భుతంగా క్రమం తప్పకుండా నడుస్తూ ఉంది.
ఆవిడ చుట్టూ వశిన్యాది వాగ్దేవతలు కూర్చుని ఆమెని స్తుతిస్తూ ఉంటారు ఎల్లప్పుడూ. ఆ స్తుతే శ్రీలలితాసహస్ర ( రహస్య ) నామాలు.
ఓ రోజు హయగ్రీవులు ( విష్ణువు ఒక అవతారం ) అమ్మవారి దర్శనానికి రావడం, ఆ స్తుతిని విని ఆనందించడం జరిగింది.
ఈ విషయం అగస్త్యమహాముని తెలుసుకుని వాటిని తనకు తెలియచేయమని అడుగుతాడు హయగ్రీవుణ్ణి. ఆయన అవి రహస్యనామాలు, అమ్మవారి అనుమతిలేదు, కుదరదంటారు. వందల సంవత్సరాలు హయగ్రీవుని అనుగ్రహం కోసం తపస్సు చేస్తాడు అగస్త్యుడు. ఇంక అగస్త్యులు పట్టువదిలేలా లేరని తలచి హయగ్రీవులు " అమ్మా, అగస్త్యుడు మీ నామాలకోసం తపస్సు చేస్తున్నారు ఇవ్వమంటారా " అని అమ్మవారిని అడుగుతారు. ఆవిడ లోకకల్యాణం కోసమే కదా అని " సరే " అనడంతో హయగ్రీవులు ఆ నామాలను అగస్త్యులకు అనుగ్రహిస్తారు.
భాస్కరరాయలు ఈ సహస్రనామాలకు భాష్యం ( వ్యాఖ్యానం ) వ్రాసారు. అది ఎంతో క్లిష్టమైన ప్రక్రియ. ఓ ఉదాహరణ చూద్దాం. అపర్ణ అని ఒకనామం ఉంది. అపర్ణా అంటే సాధారణంగా ఆకులుకూడా ముట్టనిది అని అర్ధం చెబుతూంటారు. పార్వతిదేవి పరమేశ్వరుడిని వివాహం చేసుకోవడానికి ఘోరతపస్సు చేస్తుంది. " ఆకులు అలములు తిని బ్రతుకుతున్నాం " అంటూంటారు. ఆవిడ ఆకులు కూడా తినకుండా తపస్సు చెయ్యడం వల్ల " అపర్ణ " అని పిలువబడిందిట.
మరి అంతకు ముందే " సనాతన/పురాతన " అయిన అమ్మవారి ఒకనామం " అపర్ణ " కదా. అందుకని ఈ నామానికి అర్ధం " ఋణం లేనిది/ఋణం తీర్చునది " అని భాష్యం చెప్పారు భాస్కరలాయలు. అంత శ్రమ పడ్డారు.
అమ్మవారి నామాలు ఆవిడ వర్ణనే కనుక అమ్మవారిలాగే అద్భుతంగానే ఉంటాయి. సంశయం కిం?.
మొన్న ఒకామె " ఈ నామాలు చదువుతే శ్వాసకోశ సమస్యలు ఉండవు " అన్నారు. కాని ఒక్కోనామానికి ఒక విశిష్టత ఉంది. ఒక నామపారాయణ చేస్తే చక్కటి ఉద్యోగం, ఇంకో నామపారాయణ అయితే ఆనందం, ఆరోగ్యం, వివాహం, సులువుగా ప్రసవం, శత్రునిర్మూలన ఇలా ఎన్నో అనుగ్రహిస్తారు అమ్మవారు.
అటువంటి అద్భుతమైన " శ్రీలలితాసహస్ర " నామాల్ని లోకకళ్యాణార్ధమై ఋషిద్వారా మనకు ప్రసాదించిన " శ్రీహయగ్రీవస్వామి " వారి జయంతి నేడు. శ్రావణపూర్ణిమ ఆయన జయంతి. అందరికీ శుభాకాంక్షలు. నేడు జంధ్యాల పౌర్ణమి కూడా.
" జ్ఞానానందమయం దేవం
నిర్మలస్పటికాకృతిం,
ఆధారం సర్వవిద్యానాం
హయగ్రీవం ఉపాస్మహే ".
గురువులు శ్రీహయగ్రీవుల ఆశీస్సులు అందరికీ లభించాలని కోరుకుందాం - సూర్య
శుభం భూయాత్
Comments
Post a Comment