అమ్మవారు ధర్మం పాటిస్తూన్నంతసేపే చల్లని తల్లి - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" సర్వానుల్లంఘ్యశాసనా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 995 వ నామం .
" సర్వానుల్లంఘ్యశాసనా " అంటే బ్రహ్మేంద్రాదులకు కూడా తిరస్కరింపశక్యముకాని ఆజ్ఞ కలది అని.
ధర్మం పాటిస్తూన్నంతసేపే అమ్మవారు అవ్యాజకరుణామూర్తి. కొద్దిగా ప్రక్కకు జరిగినా చండికయే. ఆవిడ చండశాసన. ఆవిడ శాసనాలను అతిక్రమిస్తే ఇంతే సంగతులు, దహనానికి అవయవాలు కూడా దొరకవు.
సనాతనధర్మం అంత మెత్తనయినది కాదు, ఓ చెంపమీద కొడితే ఇంకోచెంప చూపెట్టు అనలేదు, అనబోదు.
వేదాలలో " అభిచారమంత్రాలు " అని ఉన్నాయి. ధర్మానికి ఎవరయినా విపరీతమైన హాని చేస్తున్నప్పుడు అతని నాశనాన్ని కోరుతూ ఈ నామాలతో హోమం చేస్తారు.
ఇది జీవులకే కాదు, దేవతలకు కూడా తప్పదు. పార్వతీదేవి సరదాగా శివుడి కళ్ళు మూసింది, క్షణమే. అక్కడ క్షణం, కాని ఇక్కడ ఆ సమయం కొన్నివేల సంవత్సరాలు. సూర్యచంద్రులు శివుడి కళ్ళు. వేల సంవత్సరములు సూర్యచంద్రులు లేకపోతే పరిస్థితి ఏమిటి. సృష్టి అంతా ఓ కుదుపుకు లోనయింది. శివుడు ఆగ్రహంతో " పోయి తపస్సుచేసుకుని ప్రక్షాళన చేసుకో " అని కోప్పడ్డారు పార్వతీదేవిని.
" యదా యదా హి ధర్మస్య......(భ.గీత 4:7) " - మంచివారిని రక్షించడానికే కాదు, చెడ్డవారిని శిక్షించడానికి కూడా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటానన్నారు పరమాత్మ.
భూకంపాలయినా, సునామీలయినా, వైరస్సయినా, అణుబాంబు అయినా అమ్మవారికి కోపంవస్తేనే వస్తాయి. అమ్మవారికి కోపం వచ్చే పనులు చేయకుండా చూసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి.
ధర్మో రక్షతి రక్షితః.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయత్
Comments
Post a Comment