అమ్మవారు మంచి వాక్కుని ప్రసాదిస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" వాగ్వాదినీ " అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రనామాలలో 350వ నామం.

" వాగ్వాదినీ " అంటే వాక్కును ఇచ్చే దేవత. అంటే నాలుకమీద ఉండి వాక్కుని పలికిస్తుంది.

శ్రీశ్యామలాదేవీనవరాత్రులలో ఓరోజు అమ్మవారిని " వాగ్వాదినీ " అలంకారంలో పూజించి ఆశీస్సులు పొందుతారు భక్తులు.

మహాకవి కాళిదాసు నాలుకమీద అమ్మవారు నాలుగు బీజాక్షరాలు వ్రాయగానే శ్రీశ్యామలాదేవీదండంకంతో స్తుతించారు. ఆ దండకంలోని పదాలు వాటి అర్ధాలు రాగం వేటికవే అత్యద్భుతం. మామూలు వారు పలకలేరు వాటిని. 

కొందరు ప్రవచనకర్తలను చూస్తూంటాం. వారి ప్రవచనం నదీప్రవాహంలా సాగిపోతూంటుంది. అప్పుడే అయిపోయిందా అని ఆశ్చర్యపోతూంటాం. 

శంకరులు కాలినడకన దేశమంతా మూడు సార్లు తిరిగి ఎందరెందరితోనో వాదనలు చేసి వారిని మెప్పించి ఓడించి ధర్మపరిరక్షణ చేసారు. అటువంటి వాక్పటిమని అమ్మవారు ప్రసాదిస్తుంది.

విష్ణుసహస్రానికి భాష్యం వ్రాయమని సాక్షాత్తూ అమ్మవారే శంకరాచార్యులను అడిగారని పండితులు తెలియచేస్తున్నారు.

ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి, త్యాగయ్య మొ.గు వాగ్గేయకారులు అద్భుత కీర్తనలతో అమ్మవారిని ప్రార్ధనచేసి తరించారు. అటువంటి అద్భుత ప్రతిభ లభించాలంటే అమ్మవారి అనుగ్రహం తప్పనిసరి.

ముత్తుస్వామి దీక్షితార్ తిరువారూర్ లో జన్మించారు. ఆ వూరు అమ్మవారు " కమలాంబ ". అమ్మవారి మీద అద్భుతమైన నవావరణకీర్తనలు చేసారు. నవావరణలు అని అన్నా ఆయన 11 కీర్తనలు చేసారు. మొదటిది ధ్యానకీర్తన, 11వది మంగళకీర్తన. మధ్యలో 9 కీర్తనలు ఎంత అద్భుత ప్రక్రియతో చేసారంటే 1వది ప్రధమావిభక్తిలో చేసారు. 2వది ద్వితీయ, 3వది తృతీయ అలా 8వది సంభోదనావిభక్తి లో చేసి 9వ కీర్తనలో ఈ 8 విభక్తులూ వచ్చేలా కీర్తన చేసారు. ఎంతటి అద్భుతం, విద్వత్తు.

అమ్మవారి అనుగ్రహం లేకపోతే ఇలా వ్రాయడం అసంభవం. కారణజన్ములు.

తెనాలి రామలింగడు అమ్మవారి అనుగ్రహంతోనే ఎందరో పండితులను తికమక పెట్టి మరీ వాదనలలో ఓడించారు.

అందరినీ మంచివాక్కు తో అనుగ్రహించమని అమ్మవారిని కోరుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ