అమ్మవారు మోక్షసుఖాన్ని ప్రసాదిస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"👍

" నిర్వాణసుఖదాయినీ " ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 390 వ నామం . 

" నిర్వాణసుఖదాయినీ " అంటే మోక్షసుఖమును ఇచ్చునది అని అర్థం.

వాణం అంటే శరీరం. నిర్వాణం అంటే శరీర స్పృహ లేకపోవడం. అది ఒక అద్భుత స్థితి. అంత సులభం కాదు. ఎంతో కఠిన సాధన చేస్తే అమ్మవారు అటువంటి స్థితిని కలుగచేస్తారు. అటువంటి వారు జీవన్ముక్తులు, పరమహంసలుగా పూజింపబడుతారు.

విష్ణుసహస్రనామాలలో " నిర్వాణం " ఒకనామం. ఆ నామానికి " విలక్షణమయిన పరమానంద స్వరూపుడు " అని భాష్యం చెప్పారు ఆదిశంకరులు. ఆయన " నిర్వాణ షటకం " చేసారు. శరీరం నేను కాదు, నేను శివుడిని అని భావించమన్నారు. 

శుకమహర్షి పరీక్షిత్తుకు భాగవతం చెబుతూ ప్రహ్లాద చరిత్ర చెబుతారు. ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపుడుతో " హరి గురించిన విషయాలు చెప్పని గురువు గురువే కాదు, హరి బోధలు తెలియచేయని తల్లిదండ్రులు తల్లిదండ్రులే కాదు " అనేసరికి కోపం వచ్చి హిరణ్యకశిపుడు భటులతో ఇతన్ని నానా బాధలూ పెట్టి అయినా హరి అనకుండా చేయమంటాడు. 

ఆశ్చర్యం ఏమిటంటే మంటల్లో పడేసినా, ఏనుగులతో త్రొక్కించినా, నీటిలో ముంచినా ప్రహ్లాదుడికి ఏ బాధా లేదు. ఎందుకుంటుంది. విష్ణువు సర్వవ్యాపి అని నమ్మినవాడు ప్రహ్లాదుడు. తనలోనూ ఏనుగులోనూ మంటలోనూ నీటిలోనూ ఉన్నది విష్ణువే అయినప్పుడు ఎవరివల్ల ఎవరికి బాధ. అది నిర్వాణస్థితి.

రమణమహర్షి మొదట్లో దిగంబరంగానే ఉండేవారుట. ముఖ్యశిష్యులు " మీకు శరీరం మీది అనే భావన లేదు. కాని మీ దర్శనం కోసం వచ్చే భక్తులు ముఖ్యంగా స్త్రీలు కొంచెం ఇబ్బంది పడతారు కదా " అని అంటే అప్పటినుంచి గోచీ పెట్టుకోవడం మొదలెట్టారుట. 

అటువంటి అద్భుత స్థితిని అమ్మవారు అనుగ్రహిస్తారు కఠిన సాధనతో తనకు చేరువైన భక్తులకు.

అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ