శ్రీశారదాదేవీ నవరాత్రులు రేపటినుంచి, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" చిదగ్నికుండసంభూతా, దేవకార్యసముద్యతా " - అమ్మవారి అద్భుతనామాలు. ఇవి శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 4,5 వ నామాలు.
" దేవకార్యార్ధమై అమ్మవారు అగ్నికుండంలోంచి పుట్టారు " అని. ఎప్పుడు, ఎలా అన్నది తెలుసుకుందాం.
భండాసురుడు, అతని తమ్ముళ్ళు విశుక్రుడు విషంగుడు అనేవారు దేవతలను, ప్రజలను తమ మాయాబలంతో పీడించుకు తినేవారు. దేవతలు దెబ్బలు తిని తిని నిస్సత్తువతో బాధపడేవారు. వెళ్ళి అందరూ త్రిమూర్తులకు మొరపెట్టుకున్నారు కాపాడమని.
భండాసురుడి శక్తులు తెలుసు కనుక అమ్మవారే దిక్కు అని త్రిమూర్తులు తలచి శివుడి ఆధ్వర్యంలో మహాయాగం చేసారు. శివుడు తన మూడవకన్ను ఫాలనేత్రంనుంచి అగ్నిని సృష్టించి హోమగుండంలో వేసారు.
యాగం అయాక ఆ అగ్నికుండంలోంచి అమ్మవారు ఉద్భవించారు. అందుకే అమ్మవారిని " చిదగ్నికుండసంభూతా " అని కొలుస్తున్నారు. ఆవిడే శ్రీలలితామహాత్రిపురసుందరీదేవి. బ్రహ్మ ఆజ్ఞతో విశ్వకర్మ అమ్మవారికోసం ఒక మహానగరాన్ని సృష్టించారు. దానిపేరు శ్రీమన్నగరం.
అమ్మవారు ముందర మంత్రిణీదేవిగా శ్యామలాదేవిని, దండనాధాదేవిగా వారాహీదేవిని ఏర్పాటుచేసారు. అమ్మవారి చిరునవ్వులోంచి 64 కోట్ల సేనలు పుట్టుకొచ్చాయి.
అమ్మవారి హృదయంలోంచి " బాలాత్రిపురసుందరీదేవి " ఉద్భవించింది. ఈవిడను ముద్దుగా " బాల " అని పిలుచుకుని సేవించుకుంటారు.
" శరత్కాలే మహాపూజా
క్రియతే యా చ వార్షికి,
తస్యాం మమైతాన్మహాత్యం
శృత్వా భక్తి సమన్వితః "
మార్కండేయ పురాణంలోని దేవీమాహాత్యం " శరత్కాలంలో జగన్మాతకు ప్రత్యేకపూజలు చేసి వారి మహాత్మ్యం చదువుకుంటే అమ్మవారు సంతోషించి సకలసౌభాగ్యాలు కలుగచేస్తారు " అని తెలియచేస్తూంది.
శరదృతువుని శరత్కాలం అంటారు. శరత్కాలపు చంద్రునివలె అనేపదాన్ని కవులు తరచూ వాడుతూంటారు. ఆకాశం నిర్మలంగా ఉండి శరత్కాలపు రోజులు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈరోజుల్లో చేసుకునే నవరాత్రులని " శారదా ( దేవీ ) నవరాత్రులు " అని పిలుచుకుంటారు. తొమ్మిది రోజులూ తొమ్మిది అలంకారాలలో సేవించుకుని పదవరోజు " శ్రీరాజరాజేశ్వరీదేవి " గా పూజించుకుని అమ్మవారి సంపూర్ణ అనుగ్రహంని పొందుతారు భక్తులు.
శృంగేరీపీఠంలో భాద్రపద అమావాస్యనాడు శారదాదేవికి మహాభిషేకం చేసి జగత్ప్రసూతికాదేవిగా అలంకరిస్తారు. ఆ అలంకారంలో శారదాదేవి చిన్నపాపను ఒడిలో కూర్చోపెట్టుకుని ఉంటారు. మరునాడు ఆశ్వీయుజశుద్ధ పాడ్యమినాడు " బాల " అలంకారం. అది మొదలు రోజుకొక అలంకారంతో తొమ్మిది రోజులు తొమ్మిది అద్భుత అలంకారాలు అమ్మవారికి.
రేపటినుంచి " శ్రీశారదాదేవీనవరాత్రులు ", అనగా - ఆశ్వీయుజశుద్ధ పాడ్యమి నుండి నవమి వరకూ. విజయదశమినాడు శ్రీరాజరాజేశ్వరీదేవికి పట్టాభిషేకం.
మాగ్రామంలో శ్రీశారదాదేవీనవరాత్రులు 1956 లో మారెండో అన్నయ్యగారు, వారి స్నేహితులు ప్రారంభించారు. దినదిన ప్రవర్ధమానమై ఇప్పటికీ నిత్యనూతనంగా కొనసాగుతూన్నాయి. రోజూ చండీహోమాలు, మహామంత్రపుష్పం, వేదఘోష, వేదసభలు అమ్మవారు మురిసిపోయేలా చేస్తున్నారు మా మేనల్లుడు ఆధ్వర్యంలో ట్రస్టు సభ్యులు, గ్రామస్తులు.
ఈరోజు పరమపవిత్రమయిన " మహాలయ అమావాస్య ". పితృదేవతలకు ప్రీతికరమైన రోజు.
అందరికీ " శ్రీశారదాదేవీనవరాత్రులు/దసరా " శుభాకాంక్షలు. అమ్మవారిని ధ్యానించుకుని వారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment