ఈరోజు అమ్మవారు శ్రీ బాలాత్రిపురసుందరీదేవి అలంకారంలో అనుగ్రహిస్తున్నారు - చీమలపాటి సూర్యనారాయణ

 శ్రీమాత్రేనమః965,966బాలా 1

" బాలా, లీలావినోదినీ " - శ్రీలలితాసహస్రరహస్యనామాల్లో 965,966 నామాలు. 

బాలా అంటే కుమారీస్వరూపురాలు. చిన్నపిల్ల. సహస్రనామాల్లో ఈనామం ఒక్కసారే వస్తుంది. అసలు అమ్మవారిని బాల అనడం ఏమిటి?. ఎందుకంటే ఆవిడ " లీలావినోదిని - లీలలు/ఆటలు చేసి ( చిన్నపిల్లలా ) ఆనందిస్తుంది " కనుక. మనసు పెట్టాలేకాని రోజూ సృష్టిలో ఎన్ని వింతలు కనిపిస్తాయో. ఆశ్చర్యం వేస్తుంది. అసలు అలా ఎలా జరుగుతుంది అని.

శంకరాచార్యులు స్థాపించిన 4 పీఠాల్లో మొదటిది " శ్రీశృంగేరీ శారదా పీఠం ". భాద్రపద అమావాస్యనాడే అభిషేకం చేసి అమ్మవారిని అలంకరిస్తారు. ఆ అలంకారంలో శారదాదేవి చిన్నపాపను ఒడిలో కూర్చోపెట్టుకుని ఉంటుంది. అంటే నాబిడ్డలందరి యోగక్షేమాలు నేను చూస్తాను అని అర్ధం. మరుసటి రోజునుంచి నవరాత్రులు మొదలవుతాయి.

ఈరోజు అమ్మవారు " బాల " గా దర్శనమిచ్చి మనల్ని అనుగ్రహిస్తూంది. ఆ అవ్యాజకరుణామూర్తిని భక్తితో సేవించుకుని ఆవిడ అనుగ్రహానికి పాత్రులవుదాం.

అమ్మవారిని " బాల " గా సేవించుకున్నప్పుడల్లా శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారిని తలుచుకుని నమస్కరించుకోవాలి. తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిగారి తండ్రి గారు వెంకటప్పయ్య శాస్త్రి, తల్లి శ్రీదేవి. రాఘవగారి చిన్నతనంలో వారి ఇంటికి ఓ సిద్ధపురుషుడు వచ్చారు. ఈపిల్లవాడిని చూసి వారి తండ్రితో " మీ పిల్లవాడికి బాలను ఉపదేశిద్దామనుకుంటున్నాను, మీరు అనుమతిస్తే " అని అడిగి ఆయన అనుమతిని తీసుకుని " బాల " ను ఉపదేశించారు.

మరి శాస్త్రిగారు ఎన్నికోట్ల " బాల " జపం చేసారోకాని ఓరోజు జపం ముగించి కళ్ళు తెరిచేసరికి ఆయన ఒడిలో ఓ పాప కూర్చుని ఉంది. ఈయన ఆశ్చర్యపోయి " ఎవరి అమ్మాయివమ్మా నువ్వు " అని అడిగితే ఆ పాప " పిలిచావుగా, వచ్చాను, ఏమి కావాలో కోరుకో. చక్రవర్తిని చెయ్యనా, లేక అంతటి ఐశ్వర్యం కావాలా " అని అడిగేసరికి ఆయనకు విషయం అర్ధమయి " అవన్నీ నాకెందుకమ్మా, ఇప్పుడు వచ్చినట్లుగానే అప్పుడప్పుడు వస్తూండమ్మా " అని కోరుకోగానే కిలకిలా నవ్వి అంతర్ధానమయ్యింది అమ్మవారు.

పుణ్యపురుషులు, కారణజన్ములు.

ఈరోజు అమ్మవారు శ్రీ బాలాత్రిపురసుందరీదేవి అలంకారంలో అనుగ్రహిస్తున్నారు. అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.

ఏతత్ సర్వం శ్రీబాలాత్రిపురసుందరీదేవతార్పణమస్తు - సూర్య. 

శుభం భూయాత్

Comments

  1. 🙏🌺 మంచి విషయం తెలియజేశారు ధన్యవాదాలుండి

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ