అమ్మవారు ఈరోజు శ్రీకాత్యాయనీదేవి అలంకారంలో అనుగ్రహిస్తున్నారు. శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" భక్తిమత్కల్పలతికా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 353 వ నామం .
" భక్తిమత్కల్పలతికా " అంటే భక్తిగలవారికి కల్పలత వంటిది. కల్పలత అంటే కల్పవృక్షం. ఇవ్వలేనిది లేదు.
శ్రీలలితాసహస్రనామాలకు భాష్యం " సౌభాగ్యభాస్కరం " వ్రాసిన శ్రీభాస్కరరాయలవారు అమ్మవారి ప్రియభక్తుడు. అద్భుతమయిన విద్వత్తు. ఆయన శ్రీలలితాసహస్రనామాలకే కాక త్రిపుర, భావనోపనిషత్తులకు కూడా భాష్యం వ్రాసారు. గణేశసహస్రంకి భాష్యం వ్రాసారు. అద్భుతమైన గణేశసహస్రం శివుడు ప్రసాదించినది.
భాస్కరరాయలవారు నివసించే రాజ్యపు రాజు ఓసారి ఈయన దగ్గరకు వచ్చి " సంతానం లేదు " అని బాధపడ్డారు. ఈయన " దానిదేముంది, ఓ చక్కటి యాగం ఉంది, చేద్దాం. కొన్ని రోజులు ఇక్కడే ఉండు " అన్నారు. ఆ యాగానికి ఉదయం సాయంత్రం నదీస్నానం ముఖ్యం. అక్కడకు దగ్గరలో నది ఏదీ లేదు. భాస్కరులు " సరే సంకల్పం చేద్దాం, ఓ నదిని యాగం అయేదాకా మన గ్రామం మీదుగా ప్రవహించమని " అని సంకల్పం చేసారు. కొంచెం దూరంలో ప్రవహిస్తూన్న నది మహదానందపడిపోయింది. భాస్కరులు తనలో కొంతకాలం స్నానం చేస్తారని. వెంటనే దారి మరల్చుకుని ఆ గ్రామం మీదుగా ప్రవహించడం మొదలు పెట్టింది. నదిలో స్నానం చేస్తే మన పాపాలు పోతాయి కాని నదులు కూడా ఎవరయినా పుణ్యాత్ములు స్నానానికి వస్తారేమోనని ఎదురు చూస్తూ ఉంటాయి అని చెబుతారు పండితులు. ఇప్పటికీ ఆ గ్రామంమీదుగా ఓ నది కొంతకాలం ప్రవహించి ఆగిపోయినట్లుగా తెలియచేసే ఆనవాళ్ళు ఉన్నాయిట.
తనను నమ్ముకున్న భక్తులంటే ఎంత ప్రేమ, అభిమానమో తల్లికి. వారి హృదయాలలో కొలవైయుండి వారు ఆనందానుభూతులలో తేలియాడడానికి అన్నివిధాలా తోడ్పాటునందిస్తూనే ఉంటుంది అమ్మవారు.
కృష్ణుడు గోపికలను తమ మనోవాంఛాఫలసిద్ధి కొరకు శ్రీకాత్యాయనీదేవి వ్రతం చేయమన్నారు. గోపికలు ఈ కాత్యాయనీదేవి వ్రతం చేసినప్పుడే కృష్ణుడు వారి పాపక్షయం కోసం వస్త్రాలు దొంగిలించినది.
" భక్తిమత్ కల్పలతికా " అని కూడా ఇంకో భాష్యం చెప్పారు. అంటే భక్తి తక్కువ అయినప్పుడు అమ్మవారు కల్పలతలా ఆదుకుని భక్తి పెరగడానికి తోడ్పాటునిస్తారు అని.
ఈరోజు అమ్మవారు శ్రీకాత్యాయనీదేవి అలంకారంలో అనుగ్రహిస్తున్నారు భక్తులను.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment