మహాసరస్వతీదేవి అలంకారంలో అనుగ్రహిస్తున్నారు అమ్మవారు ఈరోజు, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" వాగధీశ్వరీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 640 వ నామం.
" వాగధీశ్వరీ " అంటే వాక్కులన్నిటికీ ఈశ్వరి. వాక్కు అంటే అర్ధనారీశ్వరం. వాక్కు ఉంటే దానికి అర్ధం ఉండి తీరుతుంది. వాక్కు అక్షరాల కూర్పు. ఈ అక్షరాలన్నిటికీ అధిదేవతలు ఉన్నారు. వారిని వాగ్దేవతలు అంటారు. ఆ వాగ్దేవతలందరికీ ఈశ్వరి అమ్మవారు. అదీ మన వాజ్మయం ఉత్కృష్టత.
" అ నుండి అః " వరకు ఉన్న 16 అక్షరాల విభాగాన్ని "చంద్ర ఖండం" అని తెలియచేసారు.
ఈ చంద్రఖండంలోని అచ్చులైన 16 వర్ణాలకు అధిదేవత " వశిని " అంటే వశపరచుకొనే శక్తి కలది అని అర్ధం.
"క" నుండి "భ" వరకు ఉన్న 24 అక్షరాల విభాగాన్ని " సౌర ఖండం " అన్నారు.
"మ" నుండి "క్ష" వరకు ఉన్న 10 వర్ణాల విభాగాన్ని " అగ్ని ఖండం" అన్నారు.
ఈ అక్షరాలన్నీ బీజ శబ్దాలు. ఇవి మనశరీరాన్నే కాకుండా ప్రకృతిని కూడా ప్రభావితం చేస్తున్నాయి అని తెలుస్తూంది. అందుకే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి అంటారు.
సౌర ఖండంలోని " క "నుండి "ఙ" వరకు గల ఐదు అక్షరాల అధిదేవత కామేశ్వరి. అంటే కోర్కెలను మేలుకొలిపే దేవత.
"చ" నుండి "ఞ" వరకు గల ఐదు వర్ణాలకు అధిదేవత మోదిని. అంటే సంతోషాన్ని వ్యక్తం చేసే దేవత.
"ట" నుండి "ణ" వరకు గల ఐదు అక్షరాల అధిదేవతా శక్తి విమల. అంటే మలినాలను తొలగించే దేవత.
"త" నుండి "న" వరకు గల ఐదు అక్షరాలకు అధిదేవత అరుణ. కరుణను మేలుకొలిపే దేవత.
"ప" నుండి "మ" అనే ఐదు అక్షరాలకు అధిదేవత జయని. జయమును కలుగ చేయునది.
అలాగే అగ్ని ఖండంలోని " య, ర,ల, వ అనే అక్షరాలకు అధిష్టాన దేవత సర్వేశ్వరి. శాశించే శక్తి కలది సర్వేశ్వరి.
ఆఖరులో ఐదు అక్షరాలైన "శ, ష, స, హ, క్ష లకు అధిదేవత కౌలిని.
ఈ అధిదేవతలనందరినీ వాగ్దేవతలు అన్నారు. వారికి ఈశ్వరి అమ్మవారు.
మనం నిత్యజీవితంలో సంభాషించేటప్పుడు వెలువడే శబ్దాలు మనపై, ప్రకృతి పై ప్రభావం చూపుతాయి. అందుకే చెడు/తప్పుడు మాటలు మాట్లాడకూడదు అంటారు.
అదే మంత్రాలు, వేదం అయితే ఇంకా అధికంగా ప్రభావం చూపుతాయి. మంత్రాలు ఛందోబద్ధంగా ఉంటాయి. అవి బుద్ధిని ప్రచోదనం చేసి మనస్సు ప్రశాంతంగా ఉండేటట్లు చేస్తాయి. అందుకే మంత్ర పూర్వకముగా అభిషేకాలు, పూజలు జరిగేచోట మంత్రతరంగాల వల్ల ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది.
మన సనాతనధర్మం చేసేదంతా ప్రకృతి, సమాజ రక్షణే. దానికి సాటి లేదు, రాబోదు.
మహాసరస్వతీదేవి అలంకారంలో అనుగ్రహిస్తున్నారు అమ్మవారు ఈరోజు. శుభాకాంక్షలు అందరికీ
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment