శ్రీదుర్గాదేవి అలంకారంలో అనుగ్రహిస్తున్నారు అమ్మవారు ఈరోజు, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" మోహనాశినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 163 వ నామం.
మోహనాశినీ అంటే మోహానికి అడ్డుకట్ట వేయడం.
అందుబాటులో లేని కోరికను తీర్చుకోవాలనుకోవడాన్ని మోహం అంటారు. ఇది అధర్మము, చెడుపనులకు దారి తీస్తుంది. ఉదాహరణకు ఒకతను మంచివాడే. ఓ చక్కని ఉద్యోగం చేసుకుంటూ భార్యాపిల్లలతో సంతోషంగా గడుపుతూ ఉంటాడు. ఓ ఖరీదయిన ప్రాంతంలో ఓ ఇల్లు కొనుక్కోవాలనే కోరిక కలుగుతుంది. అది మోహంగా బలపడుతుంది. డబ్బు కోసం చెడ్డదారులు త్రొక్కడం మొదలుపెడతాడు. చిక్కుల్లో పడతాడు. కోరిక తీరదు కాని చిక్కులు మిగులుతాయి.
ఈ విషయిన్నే పరమాత్మ గీతలో ఇలా చెబుతారు:
" స్వభావజేన కౌంతేయ
నిబద్ధః స్వేన కర్మణా,
కర్తుం నేచ్ఛసి యన్మోహనాత్
కరిష్య స్వవశో2పితత్ "
- భ.గీత 18:60
" కౌంతేయా, మోహప్రభావమున నీవు చేయుటకు ఇష్టపడని కర్మనుకూడా నీ పురాకృత స్వాభావిక కర్మలచే బంధింపబడి తత్ప్రభావమున నీవు అవశుడవై చేయుదువు " అని.
ఓ కోరిక కలగగానే తన స్థాయి ఏమిటి, అది తనకు ఎంతవరకూ అవసరం అని ఆలోచనచేయాలి. కాని అది అంత సులభం కాదు. అమ్మవారి అనుగ్రహం కావాలి.
శంకరులు ఓసారి కాశీలో ఉన్నప్పుడు ఓ వృద్ధుడు " వ్యాకరణ సూత్రాలు " వల్లెవేయడం చూసి ఆశ్చర్యపోయి " ఓ మందమతీ మరణానికి చేరువయిన నీకు మరణసమయంలో ఈ వ్యాకరణసూత్రాలు ముక్తిని ఇవ్వవు. గోవిందనామ స్మరణచేసుకుని తరించు " అని చెబుతూ అద్భుతమయిన జీవితార్ధాన్ని తెలియచేసే " భజగోవిందం ( మోహముద్గరం )" ని అనుగ్రహించారు మనవంటి సామాన్యులకు.
అమ్మవారి ధ్యాసలో గడిపితే ఇటువంటి మోహం నుంచి దూరం చేస్తుంది.
మోహం ఉచ్చులో పడకుండా చూడమని అమ్మవారిని వేడుకుందాం.
దుర్గ అంటే దుఃఖములను పోగొట్టునది అని అర్ధం.
అమ్మవారు ఈరోజు శ్రీ దుర్గాదేవి అలంకారంలో అనుగ్రహిస్తున్నారు. శుభాకాంక్షలు అందరికీ.
ఏతత్ సర్వం శ్రీదుర్గాపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment