అమ్మవారు మన హృదయంలోనే ఉంటారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" హృదయస్థా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 595 వ నామం.
" హృదయస్థా " అంటే హృదయంలో నివసిస్తుంది అని. ఎవరి హృదయంలో అని ఆలోచించనక్కరలేదు. భక్తుల హృదయంలో అని తెలుసుకోవాలి.
అమ్మవారు అన్నారు:
" నాహం తీర్థే, న కైలాసే,
వైకుంఠేవా న కర్హచిత్ " అని.
అంటే తీర్థాలలోనూ, కైలాసంలోనూ ఆఖరికి వైకుంఠంలోనూ ఉండను నేను " అని.
" వసామికింతు " - మరి ఎక్కడుంటావమ్మా అని ఋషులు అడిగితే ఆవిడ అన్నారు " మత్ జ్ఞాని హృదయాంభోజమధ్యమే " అంటే జ్ఞానుల హృదయాలలో ఉంటాను అని.
జ్ఞానులు అంటే ఎవరు?.
శంకరాచార్యులు
" బ్రహ్మ సత్యం, జగన్మిధ్య,
జీవో బ్రహ్మ ఏవ నపరః " అన్నారు.
ఈ ప్రపంచమంతా మిధ్యే, బ్రహ్మ మాత్రమే సత్యం. జీవుడు బ్రహ్మ ఒకరే అని తెలుసుకున్నవారు జ్ఞానులు.
పూజ్యగురువులు సామవేదంవారు ఓసారి ప్రవచనం చేస్తూ ఓ అద్భుత విషయం తెలియచేసారు. మన ఇంట్లో వివాహం జరిగింది. ఓ పెద్దాయన ఓ బహుమతి ఇచ్చారు. ఆ పెట్టె రంగురంగుల ముచ్చికాగితాలతో చుట్టి ఉంది. మెరిసిపోతూ ఉంది. ఎంత బాగుందో అనుకున్నాం. 4 రోజులదాకా దాన్ని అలాగే ఉంచి వచ్చిన వారందరికీ పెట్టె ఎంతబాగా తయారుచేసారో చూడండి అని చూపించాం. అలా అని ఎంతకాలం అలాగే ఉంచుకుంటాం. లోపల ఉన్న బహుమతి ఏమిటో చూడాలిగా. రంగుకాగితాలు తీసేసి అవతల పడేస్తాం, బహుమతిని చూసి జాగ్రత్తగా పెట్టుకుంటాం. అలాగే ఎప్పుడూ ఈ దేహంపై ప్రేమ, అభిమానమేనా. భగవంతుడు ఇచ్చిన ఈ పెట్టెలోపల ఏముందో చూడద్దూ. అలా శ్రద్ధగా చూస్తే అమ్మవారు కనబడతారు, కనబడగానే ఈ అశాశ్వతమైన శరీరంమీద మమకారం తగ్గిపోతుంది.
అటువంటి సాధనకోసం అవసరమయే సంకల్పాన్ని కలుగచేయమని అమ్మవారిని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment