ఉపాధ్యాయుల దినోత్సవం నేడు, వారికి కృతజ్ఞతలు తెలుపుకుందాం - చీమలపాటి సూర్యనారాయణ
🙏" శ్రీమాత్రేనమః"🙏
" ఉపాధ్యాయః " అంటే " ఉప+అధ్యాయః " దగ్గరగా ఉండి విద్య చెప్పేవారు " అని. ఈ " ఉప " ను ఉపవాసంలో ఉన్న ఉప అంటే దగ్గరగా అని తెలుసుకోవాలి.
ఉపాధ్యాయుడు దగ్గరగా ఉండి శిష్యుడికి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. స్కూల్స్, కాలేజీలు, యూనివర్శిటీల లోని అధ్యాపకులు ఈ కోవలోకి వస్తారు.
అందుకే పూర్వం చక్రవర్తులైనా పిల్లలని గురుకులాలకి పంపించేసేవారు. వారు ప్రయోజకులై తిరిగివచ్చేవారు. దగ్గరగా ఉండి అభ్యసించే విద్యకి
క్రమశిక్షణ వల్ల శక్తి ఎక్కువగా ఉంటుంది.
గురువు అంటే చీకటిలోంచి వెలుగులోకి దారిచూపిస్తాడు. ఈ చీకటులు రకరకాలు గా ఉంటాయి. అంటే ఒక్కో చీకటికి ఒక్కో గురువు అవసరం కూడా కలుగవచ్చు.
దత్తాత్రేయస్వామి తనకు 24 గురువులని స్వయంగా ఆయనే తెలియచేసారు. వారిలో ఒక కాకి, వేశ్య కూడా ఉన్నారు అని తెలుస్తూంది.
భగవద్గీతలో పరమాత్మ " ప్రతీ జీవిలోనూ నా విభూతులు ( ప్రకాశాలు/శక్తులు ) ఉన్నాయి " అని తెలియచేసారు. అంటే ప్రతీ జీవి ఒక శక్తివంతుడే, అతని నుంచి నేర్చుకోవలసిన విషయాలు కూడా ఉంటాయి. మనుషులే కాదు జంతువులు, పక్షులు, కీటకాలు అన్నీ గురుస్వరూపులే. ఓ పిచుక గూడు కట్టడం, గొంగళీ పురుగు సీతాకోకచిలుకగా మారడం, తేనెటీగ తేనెపట్టు కట్టడం లాంటివన్నీ అద్భుతాలే. నేర్చుకోవాలనే జిజ్ఞాస ఉండాలే కాని సృష్టిలో అన్నీ జ్ఞానాన్నిచ్చేవే, అన్నిటినుంచీ ఏదో ఒక విషయం నేర్చుకోవచ్చు.
అమ్మవారి సృష్టి అంత అద్భుతంగా లయబద్ధంగా ఉంటుంది. ప్రతీజీవిలోనూ ఆవిడ చైతన్యం ఉంటుంది. సృష్టిలో పనికిరానిది ఏదీ లేదు.
శంకరాచార్యులు జీవుడికి బ్రహ్మకు తేడాలేదు " బ్రహ్మ ఏవ న పరః " అన్నారు. ప్రతీజీవి తనకు తనే మొదటి గురువు, అందుకే " మనస్సాక్షి " అంటూంటారు. ఎవరైనా ఈ విషయం తెలుసా అంటే తెలియనప్పుడు " తెలియదు " అంటాం. తెలుసు అనే భ్రమ/మాయ లో లేకుండా " తెలియదు " అనే జ్ఞానం కలిగి ఉన్నట్లేకదా.
అందరూ గురువులే కాని ఉపాధ్యాయులు ప్రత్యేకంగా కొందరే ఉంటారు. వారిలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని అనుకోకూడదు.
తల్లిలాగే ఉపాధ్యాయుడు కూడా ఫలితం ( భవిష్యత్తులో ఉపయోగపడవచ్చు అనే భావన ) ఆశించకుండా మేలు చేస్తారు.
నేడు ఉపాధ్యాయులదినోత్సవం. మనందరి జీవితాలకు చక్కటి పునాదులు వేసిన ఉపాధ్యాయులందరినీ గుర్తు చేసుకుని కృతజ్ఞతలు తెలియజేసుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment