అమ్మవారి ముఖం ప్రసన్నంగా ఉంటుంది - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" సుముఖీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 459 వ నామం .
" సుముఖీ " అంటే ప్రకాశించుచున్న ముఖము గలది అని అర్ధం.
అమ్మవారు కోటిసూర్య సమప్రభ. అంత కాంతిగా ఉంటారు. ఒక సూర్యుడినే నేరుగా చూడలేము. మరి అమ్మవారిని ఎలా చూసి ఉంటారు. కఠోర సాధన చేస్తే అమ్మవారు దర్శనం ఇచ్చి అనుగ్రహిస్తారు.
మనం కూడా కళ్ళు మూసుకుని అమ్మవారి ముఖలక్షణాలను ఊహచేస్తే చూడగలం. చూసి ఆనందించగలం.
గురువు లక్షణాలు ఎలా ఉండాలో/ఉంటాయో శాస్త్రాలు స్ఫష్టంగా తెలియచేసాయి:
" సుందరస్సుముఖస్స్వచ్ఛః
సులభో బహుతంత్రవిత్,
అసంశయత్ సంశయచ్చిన్
నిరపేక్షో గురుర్మతః "
ఇక్కడ " సుముఖః " అన్నారు. అంటే గురువు ప్రసన్నమయిన ముఖంతో ఉంటారుట. ఎంత ప్రసన్నత అంటే శిష్యుడు హాస్యాస్పదమైన చిన్న సందేహాన్ని కూడా భయంలేకుండా చొరవగా అడిగేటంత.
మరి అమ్మవారు గురురూపిణి. గురుపరంపరలో ఆది. మరి అమ్మవారి ముఖం ఎంత ప్రసన్నంగా ఉంటుందో ఊహించడం కష్టం కాదు కదా.
దుర్గాసూక్తంలో అమ్మవారిని " తాం అగ్నివర్ణాం " అని ప్రార్థిస్తాం. ఎరుపు పసుపు కలిసిన చక్కటి రంగు అమ్మవారిది. శంకరులు లలితాపంచరత్న స్తోత్రంలో " ఆకర్ణదీర్ఘనయినీ " అంటారు. అమ్మవారి నయనాలు చెవులదాకా సాగి ఉంటాయిట పెద్దగా.
దేవతలు ఏవేవో కోరికలతో వస్తారుట అమ్మవారి దర్శనానికి. ఆవిడ ప్రసన్నమయిన ముఖం చూడగానే వచ్చిన పని, అడగాలనుకొన్న కోరికలను మర్చిపోయి అమ్మవారి పాదాలకు నమస్కరించి వెళ్ళిపోతారుట.
అంతటి ప్రసన్నత అమ్మవారి ముఖంలో.
దుర్గ అంటే దుర్గతిని పోగొడుతారు అని అర్థం. అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే దుఃఖాన్ని పోగొట్టి మానసిక ప్రశాంతతని ప్రసాదిస్తారు.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment