శ్రీవామన జయంతి నేడు - శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏

" వామనజయంతి " ఈరోజు. భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు అదితి కోరికపై శ్రీమహావిష్ణువు లోకకళ్యాణం కోసం వామనుడుగా అవతరించారు.

8 ఏళ్ళ బాలకుడుగా అయిపోయాడు పుట్టగానే. బ్రాహ్మణుడు దానం తీసుకోవాలంటే ఉపనయనం అయి ఉండాలి. వామనుడు బలి దగ్గరకు వెళ్ళి దానం అడగాలి. అప్పటికప్పుడు ఉపనయనం ఎలా. అప్పుడు ప్రత్యక్షనారాయణుడు సూర్యభగవానుడు ఉపనయనం తను చేస్తానని అన్నారు. ఎందుకని. గాయత్రీ మంత్రానికి అధిపతి సూర్యుడు. ఉపనయనం చేయించడానికి, గాయత్రీమంత్ర ఉపదేశానికి అంతకన్నా గొప్పవారు ఎవరు ఉంటారు.

వామనుడు మూడు అడుగుల భూమిని కోరాడు బలిని. ఓ పాదంతో భూమిని ఇంకో పాదంతో పైలోకాలను ఆక్రమించారు. మూడవ పాదం ఎక్కడ పెట్టమంటావు అని అడిగారు వామనుడు. నా తలపై పెట్టు అన్నాడు బలి.

ఇందులో అద్భుత తత్వం ఉంది. మనిషి నేను, నాది అనే భావనతో బాధపడుతూ ఉంటాడు ఎల్లప్పుడూ. నాది అంటే మమ. అంటే మమకారం. నేను అంటే అహం. అంటే అహంకారం. బలి తాను సంపాదించిన లోకాలను/సంపదను ఇచ్చేసాడు రెండు అడుగులకు. అంటే మమకారం వదుల్చుకున్నాడు. తరువాత మూడవ అడుగుకోసం తలపై పెట్టమని అడిగి అహంకారంని వదుల్చుకున్నాడు. ఈ రెండూ వదిలించుకుంటే సచ్చిదానందమే కదా. బలి పరమ భక్తుడు. అందుకే చిరంజీవి. కాబోయే ఇంద్రుడిగా అనుగ్రహించారు స్వామి.

వామనపురాణంలో ఇంకో అద్భుత విషయం ఉంది. వామనుడి రెండవపాదం ఆకాశం వేపు సాగిపోతూ సూర్యమండలాన్ని దాటి, చంద్రమండలాన్ని దాటి సత్యంలోకంకి చేరిందని తెలియచేసారు. అదెలాగా?. చంద్రుడు మనకు దగ్గరగానే ఉన్నాడుగా. మొదట దానిని కదా దాటాలి, సూర్యమండలాన్ని దాటడం ఏమిటి మొదటిగా?. మనం చూసే‌ చంద్రుడు భూమికి ఉపగ్రహం మాత్రమే. అమ్మవారి నామం " చంద్రనిభా ". చంద్రకాంతి - ఆ చంద్రమండలం వేరు. అది సూర్యమండలం పైన ఉంటుంది. శాస్త్రజ్ఞులు ఇంకా కష్టపడాలి, ఇవన్నీ కనిపెట్టడానికి.

" చిన్మాత్రం అమలం శాంతం " - నిర్మలమైన జ్ఞానమయమైన శాంతం వలన మాత్రమే శివుడిని తెలుసుకోగలుగుతారని వామన పురాణం/యోగవాశిష్ఠం తెలియచేస్తున్నాయి.

వ్యాసర్షి విరచిత వామన పురాణానికి వక్త పులస్త్యుడు, శ్రోత నారదుడు.

ప్రసిద్ది చెందిన " బ్రహ్మ కడిగిన పాదము " అనే అన్నమాచార్య కీర్తనకు స్ఫూర్తి వామనావతారమే అని భావిస్తారు. వామనుడు ఒకపాదం భూమిపై నుంచి, రెండవపాదాన్ని ఊర్ధ్వలోకంమీద ఉంచితే బ్రహ్మ ఆ పాదాన్ని ( సత్యలోకంలో ) కడిగి తరించారని చెబుతారు పండితులు.

మన వాజ్మయంలో తాత్వికమే కాదు, విజ్ఞానం కూడా ఉంది. అది శాస్త్రీయం. ఎంతటి అద్భుతం మన ఋషులవిజ్ఞానం, సనాతనధర్మం. దానిని రక్షించుకునే బాధ్యత మనందరిదీ.

వామన జయంతి శుభాకాంక్షలు అందరికీ.

ధర్మో రక్షతి రక్షితః - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ