మహాలయపక్షాలలో పితృదేవతలను పూజించుకుందాం - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" స్వధా " - ఇది అమ్మవారి అద్భుతనామం. శ్రీలలితాసహస్రరహస్యనామాలలో ఇది 536 వ నామం.
" స్వ శక్త్యా విశ్వం ధారయతి ఇతి స్వధా ". తమ శక్తితో ఈ విశ్వాన్ని ధరిస్తున్నారు పితృదేవతలు. పితృదేవతలకు మనం సమర్పించే కవ్యాలను ఈ స్వధాదేవి ద్వారా అగ్నిదేవుడు గ్రహించి వారికి అందచేస్తారు. అందుకే కవ్యాలను అగ్నిలో వేసినప్పుడు, తర్పణాలు , పిండప్రదానము చేసినప్పుడు " స్వధానమః " అంటాము.
గరుడపురాణం పితృదేవతల గురించి, పితృదేవతా వ్యవస్థ గురించి విస్తారంగా ప్రస్తుతించింది. పితృదేవతా స్తోత్రంని కూడా ప్రసాదించింది.
ముక్తిని పొందాలంటే శరీరం కావాలి జీవుడికి. జీవుడికి ఉపాధి అంటే శరీరాన్ని ఏర్పాటు చేసేది పితృదేవతలు. సూక్ష్మశరీరం అక్కడకు చేరుకోగానే మళ్ళీ ఎక్కడకు ఎప్పుడు పంపించాలో నిర్ణయించేది పితృదేవతలు.
పితృదేవతలు అంటే మన పితృదేవతలే కాదు పితృదేవతా వ్యవస్థలో ఉన్నవారందరూ కూడా అని గ్రహించాలి. మన పితృదేవతలను పూజిస్తే పితృదేవతా వ్యవస్థ సంతోషించి ఆశీర్వదిస్తుంది.
శ్రాద్ధం అంటే శ్రద్ధతో చేసేది. శ్రద్ధ అంటే ఏమిటి?. శాస్త్ర విషయములయందు విశ్వాసము. సూక్ష్మశరీరులయిన దేవతలను భౌతిక ఇంద్రియములతో చూడలేము. కనుక శాస్త్రములు తెలియచేసిన విషయములను నమ్మాలి.
" అగ్ని ముఖావై దేవాః " - అగ్నిముఖంగానే ఏదయినా దేవతలకు చేరుతుంది అని తెలియచేస్తూంది వేదం. పురుష సూక్తంలో " ముఖాత్ ఇంద్రశ్చాగ్నిశ్చ " అని కీర్తిస్తాం. విరాట్ పురుషుని నోటిలోంచి అగ్ని ఉద్భవించారు అని. ముఖం అంటే నోరు.
పితృగణాలు మొత్తం 31. మనకు సాధారణంగా " వసు రుద్ర ఆదిత్య " రూపాలు ముఖ్యమైనవి. ఇవి మన ముందరి 3 తరాలకు అంటే తండ్రి, తాత, ముత్తాతలకు ప్రతినిధులు. తర్పణాలు కాని పిండాలను కాని ఈ మూడురూపాలకు ఇస్తూంటాం, అవి అందరకూ చేరుతాయి.
భాద్రపదమాస బహుళపక్షం పితృదేవతలకు పరమపవిత్రమైన సమయం. దీనిని మహాలయపక్షం అని పిలుచుకుంటారు. ఈ సమయంలో యధాశక్తి పితృదేవతల సంతృప్తికోసం, అనుగ్రహంకోసం శ్రమించాలి. వారు సంతానాభివృద్ధిని, సంతాన సౌభాగ్యాన్ని కలిగిస్తారు.
ఈ పుణ్యకాలంలో పితృదేవతలకే కాకుండా గతించిన బంధువులను, మిత్రులను, గురువులను కూడా స్మరించుకుని తర్పణాలు, దానాలు ఇచ్చుకోమని శాస్త్రం చెబుతూంది..
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment