అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఇంద్రియనిగ్రహం ముఖ్యం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏


" దురారాధ్యా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 771వ నామం.

" దురారాధ్యా " అంటే ఇంద్రియనిగ్రహములేని చపలులచే ఆరాధింపశక్యము కానిది అని అర్థం.

ఇంద్రియాలను నిగ్రహించుకున్నవారే అమ్మవారిని ఆరాధించడానికి ఎంతో సాధనచేయాలి. ఆ సాధనకు వైరాగ్యం కూడా తోడవాలి. మరి చపలులకు అమ్మవారి ఆరాధన ఎలా సాధ్యపడుతుంది.

ఆదిశంకరులు సౌందర్యలహరి స్తోత్రం చేస్తూ ఓ అద్భుత శ్లోకం చేసారు:

" పురారాతేరన్తః పురమసి
  తాత స్త్వచ్చరణయో
  స్సపర్యామర్యాదా 
  తరళకరణానా మసులభా
  తథా హ్యేతే నీతాశ్శత
  మఖముఖాస్సిద్ధి మతులాం  
  తవ ద్వారోపాన్తస్ధితిభి 
  రణిమాద్యాభిరమరాః "

దీనిలో " తరళకరణానాం అసులభా " అన్నారు. తరళ అంటే చపలం, కరళానాం అంటే ఇంద్రియాలు. చపలమైన ఇంద్రియాలు ఉన్నవారికి అమ్మవారు అసులభం, దొరకడం కష్టం అన్నారు. ఎందుకంటే ఇంద్రాది దేవతలు కూడా అమ్మవారి వాకిలి యందున్న అణిమాదైశ్వర్యాలచే అధికంగా సుఖం పొందుతున్నారుట. ఇంద్రాది దేవతలు లాంటి పుణ్యపురుషులే తాత్కాలికమయిన ఐశ్వర్యాల వెంట పడుతూంటే సామాన్యమానవుల పరిస్థితి ఏమిటి అని ఆలోచన చేయాలి.

మరి ఇంద్రీయనిగ్రహం కోసం ఏమి చేయాలి?.

" అసంశయం మహాబాహో
  మనో దుర్నిగ్రహం చలం
  అభ్యాసేన తు కౌంతేయ
  వైరాగ్యేణ చ గృహ్యతే "
                         -  భ.గీత 6:35

పరమాత్మ " మనస్సును నిగ్రహించుకోవడం అంత సులువుకాదు " అని తెలియచేస్తూ  " కష్టమే కాని అభ్యాసంతోనూ మరియు వైరాగ్యంతోనూ నిగ్రహించుకోవడం కష్టం కాదు " అంటారు.

పరమాచార్య అంతటి వైరాగ్యంతో అమ్మవారి సేవలో గడిపి " నడిచే దేవుడు " గా గౌరవింపబడ్డారంటే అది ఆయన ఎన్నో జన్మల సాధన ఫలితంగా అర్ధం చేసుకోవాలి.

సాధన మొదలు పెడదాం అని సంకల్పం అంటూ చేస్తే అమ్మవారి తోడ్పాటు ఎలాగూ ఉంటుంది. అటువంటి సంకల్పం చేసుకునేలా మన బుద్ధులను ప్రచోదన చేయమని అమ్మవారిని వేసుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్ 

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ