కంచి పరమాచార్య చంద్రమౌళీశ్వరుడికి అభిషేకం చేసినా లోకకళ్యాణం అనే ఫలితం వస్తుంది - ఫలితం లేని కర్మ ఉండదు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" కాయేన మనసా బుద్ధ్యా
కేవలైరింద్రియైరపి,
యోగినః కర్మ కుర్వంతి
సంగం త్యక్త్వాత్మశుద్ధయే "
- భ.గీత 5:11
కర్మయోగులు మమతాసక్తిరహితులై కేవలము ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, శరీరములద్వారా అంతఃకరణశుద్ధికై కర్మలను ఆచరింతురు.
అంతఃకరణశుద్ధి అన్నారు ఇక్కడ.
ప్రతీ మనిషికి అంతరాత్మ ఉంటుంది. అది మనం హద్దు దాటకుండా ఉండడానికి జాగరూకతలు చెబుతూ ఉంటుంది. దానిని ఎల్లవేళలా శుద్ధంగా ఉంచుకోవాలి.
పారాయణ చేయాలన్నా, పూజచేయాలన్నా, ప్రవచనం వినాలన్నా ఇంద్రియాలు అవసరమే.
ఈ ఇంద్రియాలలో జ్ఞానేంద్రియాలు (5), కర్మేంద్రియాలు (5) బహిఃకరణాలు. కరణాలు అంటే పరికరాలు. వీటిని వాడుకునేవి " అంతఃకరణాలు ". లోపల ఉంటాయి. ఇవి 4.
మనస్సు - సంకల్పవికల్పాలు చేసేది. మంచిని చెడునూ కూడా చేయిస్తుంది.
బుద్ధి - గ్రహ్యనిర్ణయం - విచక్షణ/గ్రహించడం - మంచి, చెడు లాంటివి.
అహంకారం - నేను అనే భావన. పుట్టుకతో మొదలయి మరణించేవరకూ వదలదు.
చిత్తం - ( మాయ ) స్మృతి రూపం. ఇది మనస్సును, బుద్ధిని, అహంకారంని తప్పుదారి ( పరీక్ష ) పట్టించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. చిత్తశుద్ధి అంటూంటారు అందుకే. ఇది చాలా ముఖ్యం.
మనసును బుద్దిని పరమాత్మ ఆరాధన తో నియంత్రణలో ఉంచుకుంటే చిత్తశుద్ధి ఏర్పడుతుంది. ఈ అహంకారం, ఇంద్రియాలు మనల్ని బాధించవు. ఇంద్రియాలు మన అధీనంలో ఉంటాయి. కాని అది అంత సులభం కాదు.
కర్మయోగి ముక్కు మూసుకుని మూల కూర్చోరు. ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని అన్నింటినీ ఉపయోగిస్తూ ఉంటారు. చేసే పనులన్నీ పరమాత్మ సంకల్పమే అనే భావనతో చేస్తారు.
మనం మన కళ్ళతో చూసిన కర్మయోగి " కంచి పరమాచార్యులు ".
కామాక్షీదేవి పూజకు ఎవరయినా చక్కటి మందారపువ్వులు ( అంటే తెల్ల జిల్లేడు పువ్వులు ) ఎక్కువగా తీసుకుని వస్తే " బావున్నాయమ్మా ఎక్కడినుంచి తెచ్చావు? " అని అడుగుతారు సంతోషంతో. అమ్మవారికి " మందారకుసుమప్రియా " అంటూ పూజచేస్తారు. ఎవరయినా ముత్తయిదువు మడిగా బెల్లపు పరమాన్నం తీసుకుని వస్తే ఆనందంతో " గుడాన్నప్రీతమానసా" అంటూ నైవేద్యం పెడతారు. ఎవరయినా శ్యామశాస్త్రిగారి " కామాక్షీదేవి " కీర్తన పాడితే " బాగా పాడేవమ్మా, నీ గురువుగారు ఎవరు? " అని అడుగుతారు. భక్తుడికి ఎవరికయినా అపాయం కలిగిందని చెబితే కామాక్షీదేవిని పూజించి పరిహారం తెలియచేస్తారు.
పరమాచార్య ఈ అశాశ్వతమైన బాహ్యప్రపంచంతో తనకు సంబంధంలేదు అని అనలేదు. ఇంద్రియాలను మాత్రం అంతరాత్మ శుద్ధికోసమే ఉపయోగించారు. నడిచే దేవుడు, కారణజన్ముడు, సనాతనధర్మ పరిరక్షకులు అయారు. అటువంటి వారిని తలచుకున్నా మనశ్శాంతి, ఆనందం కలుగుతాయి.
ఏతత్ సర్వం శ్రీకార్తీకదయాదామోదరార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment