ఆదిశంకరులు శివుడితో " నీకు నాకు రాం రాం - బాకీలు ఏమీ లేవు ఇక " అంటున్నారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
5/11/2025 న పూజ్యగురువులు శ్రీ గరికిపాటి వారు భక్తి టివి వారి కోటిదీపోత్సవంలో అనుగ్రహభాషణం చేస్తూ శంకరాచార్య విరచిత శివానందలహరి లోని రెండు శ్లోకాలను వివరిస్తూ శంకరులు శివుడితో " నీకు నాకు రాం రాం " అన్నారు అని తెలియచేసారు. వివరణ చూద్దాం:
ఈ 27 వ శ్లోకానికి 60 శ్లోకాల తరువాత వచ్చే 87 వ శ్లోకానికి ఓ చక్కటి సంబంధం ఉంది.
కరస్థే హేమాద్రౌ గిరిశ నికటస్థే
ధనపతౌ గృహస్థే స్వర్భూజా
మర సురభి చింతామణిగణే,
శిరఃస్థే శీతాంశౌ చరణయుగళస్థేఽఖిల
శుభే కమర్థం దాస్యేఽహం భవతు
భవదర్థం మమ మనః " - 27
ఈ శ్లోకంలో శంకరులు " శివా, కొద్దిగా బంగారం ఇద్దామంటే బంగారు కొండ ( మేరు పర్వతం ) పై కూర్చున్నావు, ధనం ఇద్దామంటే కుబేరుడికే ఐశ్వర్యం ఇచ్చావు, కల్పవృక్షం, కామధేనువు, చింతామణి, శిరస్సుపై చల్లటి చంద్రుడు అందరూ నీ దగ్గరే ఉన్నారు. ఇక నేను నీ దగ్గర లేనిది ఏమివ్వగలను. అందుకని నా " మనస్సు " ను తీసుకో అన్నారు శంకరులు ఈ శ్లోకంలో.
అశనం గరళం ఫణీ కలాపో
వసనం చర్మ చ వాహనం మహోక్షః,
మమ దాస్యసి కిం కిమస్తి శంభో
తవ పాదాంబుజభక్తిమేవ దేహి " - 87
( నేను మనస్సు ఇచ్చాను కనుక నువ్వు ఏమయినా తిరిగి ఇద్దామనుకుంటే ) విషం పానీయం, పాము ఆభరణం, జంతు చర్మ వస్త్రం, తిరగడానికి వృషభ వాహనం మాత్రం నాకు ఇవ్వకు. నేను భరించలేను. నీ పాదభక్తిని ప్రసాదించు చాలు అని వేడుకున్నారు శంకరులు.
ఎంత చమత్కారమో. నేను ఏమి ఇద్దామన్నా అన్నీ నీదగ్గర ఉన్నాయి కనుక నా మనస్సు తీసుకో అంటున్నారు. నువ్వు నీ దగ్గర ఉన్నవాటిలో ఏమయినా ఇచ్చినా నాకు ఉపయోగం లేదు కనుక నాకు బాగా ఉపయోగపడే నీ పాద భక్తిని ప్రసాదించు అంటున్నారు శంకరులు.
నీకు నేను ఇది ఇస్తాను, నువ్వు నాకు అది ఇయ్యి. " రాం రాం " - బాకీ ఏమీ మిగలదు అని.
ఈ ప్రార్థన శంకరులది కాదు, మనకోసం మనందరి తరపున శంకరులు ప్రార్ధిస్తున్నారు శివుడిని.
ఏతత్ సర్వం శ్రీకార్తీకదయాదామోదరార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment