శ్రీకాలభైరవాష్టమి నేడు, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" మహాభైరవపూజితా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 231 వ నామం.
" మహాభైరవపూజితా " అంటే మహాభైరవుడిచేపూజింపబడినది అని భాష్యం చెప్పారు.
" భరణ రమణ వమన " కర్త భైరవుడు. సృష్టి స్థితి లయలను చేయు శివునకు భైరవుడని పేరు. మూడు కార్యములు ఒకడేచేయు మహత్వమువలన మహాభైరవుడు అని కొలువబడుతున్నారు అని భాష్యం చెప్పారు.
పద్మపురాణంలో కూడా శంకరుడు అక్షమాలను ధరించి న్యాసముచేత అమ్మవారిని పూజించారు అని తెలియచేసారు.
మహాభైరవుడి గురించి తెలుసుకుందాం.
" అసితాంగో రురుశ్చండః
క్రోధశ్చోన్మత్త భైరవః
కపాలీ భీషణశ్చైవ
సంహార శ్చాష్ట భైరవాః
ఓం అష్టభైరవేభ్యో నమః "
ఈ శ్లోకం ద్వారా భైరవులు ఎనిమిది మంది అని తెలుస్తూంది. వీరు అసితాంగ, రురు, చండ, క్రోధ, ఉన్మత్త, కపాలి ( కాల ), భీషణ, సంహార భైరవులు.
అష్టభైరవుల పూజ అనేక అడ్డంకులను తొలగించడంలో, రక్షణ కల్పించడంలో, ఆధ్యాత్మిక పురోగతి పెంపొందించడంలో శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధనగా గుర్తించబడింది. ఆరోగ్యానికి కూడా భైరవారాధన ఉపయోగపడుతుంది.
ఈ అష్టభైరవులు అష్టదిక్కులకు అధిపతులు:
1. అసితాంగ - తూర్పు 2. రురు - ఆగ్నేయ 3. చండ - దక్షిణ 4. క్రోధ నైరుతి
5. ఉన్మత్త - పశ్చిమ 6. కపాల - వాయువ్య 7. భీషణ - ఉత్తర 8. సంహార - ఈశాన్య దిక్కునకు అధిపతులు
బ్రాహ్మి మొదలగు వారు వీరి భార్యలు:
1. అసితాంగ - బ్రాహ్మి 2. రురు - మహేశ్వరి 3. చండ - కౌమారి 4. క్రోధ - వైష్ణవి
5. ఉన్మత్త - వారాహి 6. కపాల - ఇంద్రాణి 7. భీషణ - చాముండి 8. సంహార - చండిక
అమ్మవారు వివిధ రూపాలలో అనుగ్రహిస్తారు కనుక అమ్మవారిని బహురూపా " అని కొలుస్తాం. లలితాసహస్రనామాలలో 824 వ నామం.
వీరిలో కాశీ క్షేత్రపాలకుడయిన కాలభైరవుడి గురించి అందరికీ తెలిసినదే.
కాల కాలాయ విద్మహే, మహాకాలాయ ధీమహి, తన్నో కాలభైరవ ప్రచోదయాత్ - కాలభైరవ గాయత్రి
శ్రీకాలభైరవాష్టమి నేడు. శుభాకాంక్షలు అందరికీ.
శుభం భూయాత్
శ్రీకాలభైరవాష్టమి నేడు. శుభాకాంక్షలు అందరికీ.
శుభం భూయాత్
Comments
Post a Comment