నేరం జనాలది కాదు. గరిటెలది అన్నారు పూజ్యులు గరికిపాటి వారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" రామప్రభావాత్ ఆశ్చర్యం " - ఇది రాముడి దయే అని అనుకుంటారు హనుమ. లంకలో తోకకు నిప్పు పెట్టినప్పుడు " ఇంతలా అగ్నిమంటలు పెరిగిపోతూన్నా అసలు వేడే లేదేమిటి " అని ఆశ్చర్యపోతారు హనుమ.సకలవేదపారంగతుడిని కదా నా గొప్పే అనుకోలేదు, రాముడి దయ అనుకున్నారు. మనకు జరుగుతూన్న మంచికి కలుగుతూన్న సుఖాలకి ప్రతీరోజూ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉండాలి.
" ప్రవచనాలు బాగానే వింటున్నారు, దేవాలయాలకు బాగానే వెడుతున్నారు. అభిషేకాలూ అష్టోత్తరాలూ బాగానే చేయించుకుంటున్నారు. దానధర్మాలూ బాగానే చేస్తున్నారు. కాని మనుషుల్లో రావలసినంత మార్పు రాలేదనీ మంచితనం తగ్గిపోయిందనీ బాధపడుతూంటారు కొందరు.
నేరం మనుషులది కాదు " గరిటెలది " అన్నారు పూజ్యులు గరికిపాటి వారు.
గరిటె వంటగదిలో ఉంటుంది. బిర్యానీ చేసినప్పుడు బాగా కలుపుతుంది, సాంబారుని కలుపుతుంది, బాదంఘీర్ ని, పాయసాన్ని కలుపుతుంది, కారంపెట్టి వండిన కూరలని కలుపుతుంది, ఆవకాయని బాగా కలుపుతుంది - విశేషమేమిటంటే అన్నింటిలోనూ అది పాలుపంచుకున్నా ఈ అద్భుత రుచులేవీ గరిటెకు అంటవు. ఇప్పుడు ఈ భక్తి విషయంలోనూ జరుగుతూన్నది అదే. ఏదో మొక్కుబడి అయిపోయి " గరిటె " లా మిగిలిపోతున్నాం.
ఓ ఉదాహరణ చూద్దాం. వైకుంఠఏకాదశి రోజున ఉత్తరద్వారం గుండా గుడిలోకి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుంటే పుణ్యం అని తెలియచేసింది శాస్త్రం. చూడకపోతే పాపమని ఎక్కడా చెప్పలేదు. దీన్ని అనుకూలంగా మలుచుకోవడానికి కొంత రుసుం పెడతారు గుడి అధికారులు. పరవాలేదు. గుడికి గుడిలోని దేవుడికి డబ్బు అవసరం లేకపోయినా " వేరే " అవసరాలకోసం అధికార్లు రకరకాల గిమ్మిక్స్ చేస్తూంటారు. దానిలో ఒకటి ఏకాదశి నుండి పదిరోజుల దాకా " ఈ " దర్శనాలు చేసుకోవచ్చు అంటారు. వాళ్ళ అవసరాలకోసం రకరకాలుగా చెబుతూంటారు. వెళ్ళేవారికి బుర్ర ఉండాలిగా. వైకుంఠఏకాదశి దర్శనాన్ని పాడ్యమి విదియ నాడో త్రయోదశి నాడో చేసుకోవడం ఏమిటి , పైగా అధికడబ్బులు ఇచ్చి మరీ అని కొంచెం ఆలోచనచెయ్యాలి.
వింత ఏమిటంటే విఐపిలు అందరూ ఏకాదశి రోజునే దర్శనం కానిచ్చేస్తారు. విఐపిలకు ఏకాదశి నాడు కాకుండా మిగతా రోజుల్లో దర్శనం ఏర్పాటు చేస్తే ప్రజలలో నమ్మకం పెరిగి టికట్ కలక్షన్స్ కూడా పెరుగుతాయి కదా.
కాని నేరం వారిది కాదు " గరిటెలది ".
ముక్కోటి/వైకుంఠ ఏకాదశి నేడు. పరమ పవిత్రమయిన రోజు. శుభాకాంక్షలు అందరికీ.
ఏతత్ సర్వం శ్రీనారాయణార్పణమస్తు.
శుభమస్తు
Comments
Post a Comment