శ్రీ పురందరదాసు ఆరాధనోత్సవం నేడు. స్మరించుకుని తరిద్దాం - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తుశుభమస్తు"🙏
" ప్రాప్య పుణ్యకృతాం
లోకానుషిత్వా శాశ్వతిః సమాః,
శుచీనాం శ్రీమతాం గేహే
యోగభ్రష్టో2భిజాయతే"
- భ.గీత 6:41
" అథవా యోగినామేవ
కులే భవతి ధీమతామ్,
ఏతద్ధి దుర్లభతరం
లోకే జన్మ యదీదృశం "
- భ.గీత 6:42
కృష్ణ పరమాత్మ " ఈ జన్మలో సాధన మొదలు పెట్టి పూర్తికాని యోగులు మళ్ళీ జన్మ తీసుకుని సాధన కొనసాగిస్తారు " అన్నారు గీతలో.
పురందరదాసు జీవితం దీనికి ఓ చక్కని ఉదాహరణ
శ్రీనివాసనాయక అనే ఆయన ఒక వజ్రాలవ్యాపారి కొడుకు. లోభి. పిల్లికి కూడా బిచ్చం వేసేవాడుకాడు. 20 ఏట తల్లితండ్రులు పోవడంతో వ్యాపారం చూసుకోవడం మొదలు పెట్టాడు. విపరీతంగా సంపాదించాడు. ఆరోజుల్లోనే ఆయన్ని " నవకోటిపతి " అని పిలిచేవారు. అంతటి జమీందారు.
ఇతను ఓరోజు ఓ పేదబ్రాహ్మణుడు వచ్చి " నాకొడుకు ఉపనయనం, ఏమయినా సహాయం చెయ్యండి " అని బ్రతిమిలాడినా వ్యంగ్యంగా దూషించి పొమ్మని బయటకు వెళ్ళిపోతాడు. బ్రాహ్మణుడు వ్యాపారి భార్యను బ్రతిమిలాడుతాడు. ఆవిడ జాలిపడి తన ముక్కుపుడకను ఇస్తుంది. ఇతను ఆ ముక్కుపుడకను అమ్మడానికి ఆ వ్యాపారి కొట్టుకే వెడతాడు. వ్యాపారి ముక్కుపుడకను గుర్తుపట్టి, బ్రాహ్మణుడిని తన కూడా రమ్మని ఇంటికి వచ్చి భార్యతో " నీ ముక్కుపుడకను తీసుకురా " అనడంతో ఆమె విషయం తనభర్తకు తెలిసిపోయినట్లుంది, ఇక బ్రతకడం వృధా అని అనుకుని విషం త్రాగడానికి గిన్నె ఏర్పాటుచేసుకుని భగవంతుడికి ప్రార్ధనలు చేసి వచ్చి గిన్నె తీసుకుని త్రాగపోతే దానిలో ముక్కుపుడక కనబడుతుంది. దానిని తీసుకెళ్ళి భర్తకు ఇస్తే అతనికి మతిపోతుంది. పేదబ్రాహ్మణుడి గురించి చూస్తే లేడు, వెదుకుతే దొరకలేదు.
ఈ చిన్న సంఘటన ఆయన్ని జ్ఞానిని చేసింది. ఏమిటీ జీవితం అనుకున్న ఆ వ్యాపారి " శ్రీనివాస నాయక " తన 30వ ఏట వైరాగ్యం చెంది, యావదాస్తిని దానం చేసేసి " పురందరదాస " గా మారి జీవితాంతం దేవుని " పాండురంగ విఠలుని " ధ్యాసలోనే గడిపారు.
475000 కీర్తనలు చేసారు/వ్రాసారు దాసు. సంగీతం నేర్చుకునేవారికి ప్రారంభంలో అనుకూలంగా ఉండడం కోసం " మాయామాళవగౌళ " రాగాన్ని అందించారు. పిల్లలు పాడుకోవడానికి " పిళ్ళారి గీతాలు " ఇచ్చారు. భాగవతంలోని కష్టమయిన శ్లోకాలన్నిటిని తేలికపదాలతో అందరూ పాడుకునేలా కీర్తనలుగా ఇచ్చారు. ఈయనను త్యాగయ్య తన " గేయనాటకం, ప్రహ్లాద భక్తి విజయం " లలో కొనియాడారు, " మహాపురుషులు " అని నివాళులు అర్పించారు.
అందరూ ఆయన్ని " నారదుని " అవతారంగా భావించి గౌరవించేవారు.
విజయనగరసామ్రాజ్యం అంతా కీర్తనలు పాడుతూ పర్యటించారు. వింత ఏమిటంటే ఈయన తన 80వ ఏట మరణించిన కొద్దిరోజులకే విజయనగరసామ్రాజ్యం పతనమయింది.
పురందరదాస 5 లక్షల కీర్తనలు చేయాలనుకున్నారుట. 475000 చేసారు. పరమపదించేముందు చిన్నకొడుకు " మధ్వపతి " ని పిలిచి మిగిలిన 25 వేల కీర్తనలను నువ్వు ఎలాగయినా పూర్తిచేయాలి అంటే కొడుకు " మళ్ళీ నేనెందుకు, నువ్వే నీ మళ్ళీ జన్మలో పూర్తి చేద్దువుగానిలే " అని చెప్పాడుట.
కొంతకాలానికి " విజయదాస " అనే ఆయన కీర్తనలు చేయడం, అవి పురందరదాసు కీర్తనలలాగానే ఉండడంతో పురందరదాసుగారే విజయదాసగా మళ్ళీ జన్మించారు అని ప్రజలు అనుకునేవారుట. ఆశ్చర్యంగా విజయదాస 25 వేల కీర్తనలే చేసారు. 5 లక్షల కీర్తనల లెక్క సరిపోయిందిగా.
పురందరదాసు ఆరాధనోత్సవం నేడు. కారణజన్ముడు. స్మరించుకుని తరిద్దాం - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment