భీష్మ ఏకాదశి నేడు. పరమ పవిత్రమయిన రోజు. భీష్ముడిని ధ్యానించుకుని తరిద్దాం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తుశుభమస్తు"🙏

" శతానందః " విష్ణు సహస్రనామాలలో ఒక అద్భుత నామం. 

అనంతమైన ఆనందములు, వందలాది ఆనందములు కలవాడు అని భాష్యం చెప్పారు ఆదిశంకరులు. 

మహాభారతంలో భీష్ముడు జీవుల ఉన్నతి కోసం అతి పవిత్రమైన విష్ణు సహస్రనామాలు ప్రసాదించారు. దీనిలో శతానందః అని ఒక అద్భుత నామం. 

వందలాది ఆనందములు అన్నారు ఏమిటి శంకరులు అని ఆశ్చర్యం వే‌స్తుంది కదా.

తైత్తిరీయోపనిషత్తు ఆనందాల గురించి ఇలా తెలియచేస్తూంది:

మనుషులలో కొందరు ఉత్తములు పొందే ఆనందాన్ని మానుషానందం అంటారు. మానుషానందంకి 100 రెట్లు దేవమానుషానందం. దానికి వందరెట్లు గంధర్వానందం. దానికి వంద రెట్లు దేవగంధర్వానందం. దానికి వంద రెట్లు దేవతానందం. దానికి వంద రెట్లు బృహస్పతానందం. దానికి వంద రెట్లు బ్రహ్మానందం - ఈ ఆనందాలన్నీ కలిగినవారు శతానందః - ఆయన మహావిష్ణువు. 

ఈ ఆనందానికి మించినది లేదు. 

మానుష్యానందం అంటే ఉదాహరణకు భూలోకానికి చక్రవర్తి ఒకాయన. ఆయనకు శతృవు ఉండకూడదు, అన్నీ అనుకూలిస్తూ ఉండాలి. ఆరోగ్యం బాగుండాలి. అందరూ ఆయనకు అనుకూలంగా ఉండాలి‌ - ఇన్ని ఉన్న ఆయనకు ఏ కోరికా లేకపోతే అతను పొందే ఆనందాన్ని మానుషానందం అంటారుట.

భూలోకంలో ఇటువంటి వారు ఎవరయినా ఉన్నారా అని అడిగితే శంకరులు ధర్మరాజు అటువంటి వారు అన్నారు.

కఠోపనిషత్తు మనిషికి రెండు జీవనమార్గాలు ఉంటాయని తెలియచేసింది:

" శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతః

  తౌ సంపరీత్య వివినక్తి ధీరః " - 1.2.2

" జీవనయానంలో మానవుని ముందు రెండు మార్గాలున్నాయి.  మొదటిది శ్రేయోమార్గం - ఇది జ్ఞాన సముపార్జన ద్వారా శ్రేయస్సు వైపుకు నడిపించి శాశ్వతానందాన్ని, పరిపూర్ణతను చేకూరుస్తుంది.  రెండవది ప్రేయో మార్గం - ఇది ప్రియం కలుగజేసేది.  కర్మానుష్టానం ద్వారా కొంత అభ్యుదయం కలిగించినా అది అశాశ్వతము, దుఃఖ హేతువు అవుతుంది " అని.

నైతిక విలువలను పాటిస్తూ, శ్రేయోమార్గంలో పయనిస్తూ ఉంటే ఇంద్రియ నిగ్రహం సాధ్యమవుతుంది.  అప్పుడు ఇంద్రియాలను బాహ్య విషయాల నుండి మరలించి అంతర్ముఖం చేసి సాధన చేస్తే ఆత్మావలోకనం సాధ్యమవుతుంది.   అయితే ఇది అంత సులభమైనది కాదు.  కాని ఒకసారి అంతర్ముఖులవుతే వారు స్వాత్మారాములు, నిరపేక్షులు అవుతారు. వారిలో వారే ఆనందిస్తారు. అది బ్రహ్మానందంస్థితి. 

శుకమహర్షి వంటి అవధూతలు బ్రహ్మానందస్థితిలో ఉంటారు ఎల్లప్పుడూ.

ఈ రోజు భీష్ము ఏకాదశి. పరమ పవిత్రమయిన రోజు. ధ్యానించుకుని తరిద్దాం - సూర్య. 

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ