జన్మకో శివరాత్రి అన్నారు. ఈరోజు పరమ పవిత్రమయిన శివరాత్రి. శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏


" యదాసమస్తన్న దివా నరాత్రి ర్నసన్న
  చాసచ్ఛివ ఏవ కేవలం " - వేదం.

సృష్టికి పూర్వం సత్తు కాని అసత్తు కాని లేదనియు, కేవలం శివుడు ఒక్కడే కలడని తెలియచేసింది వేదం.

" శివ ఏవ కేవలం " - శ్వేతాశ్వతరోపనిషత్తు - శివుడు ఒక్కడే పరదైవము, అతనొక్కడే కలడని తెలియచేసింది ఈ ఉపనిషత్తు.

శౌనకాది మహర్షులకు సూతుడు శ్రీశివ మహాపురాణం వైశిష్ట్యాన్ని చెబుతూ శ్రవణకీర్తనమననములతో ముక్తి పొందవచ్చు అని తెలియచేసారు. మహర్షులు కలియుగంలో మనుషులు అల్పాయుష్కులు కదా, కొద్దికాలం లోనే మోక్షం కలిగే సాధన ఏదయినా తెలియచేయమన్నప్పుడు " లింగార్చన " అతి ఉత్తమము, సులభమైన మార్గం అని తెలియచేసారు.

శివలింగానికి జీవితమంతయూ అర్చన చేసేవారికి శివానుగ్రహం, ముక్తి లభిస్తాయని తెలియచేసారు.

ఇతర దేవతాగణాలన్నిటినీ మూర్తి రూపంలో మాత్రమే పూజిస్తాం. ఒక్క శివుడినే మూర్తియందును, లింగమందును పూజిస్తాం. ఆ రకంగా శివుడు సకళుడు, నిష్కళుడుగా పూజింపబడుతున్నారు. ఈ శివ " లింగం " ఎప్పుడు ఆవిర్భవించిందో శ్రీశివమహాపురాణంలో తెలియజేయబడింది.

మొదట అద్భుతమయిన ఈ లింగోద్భవం గురించి నందికేశ్వరుడు సనత్కుమారులకు తెలియచేసారు. లింగోద్భవం అయిన రోజును శివరాత్రిగా భక్తులు జరుపుకుని తరిస్తారు.

" శివరాత్ర మహోరాత్రం
  నిరాహారో జితేంద్రియః,
  అర్చయేద్వా యథాన్యాయం
  యథాబల మవంచకః,
  యత్ఫలం మమపూజాయాం
  వర్షమేకం నిరంతరం,
  తత్ఫలం లభతే సద్యః
  శివరాత్రౌ మదర్చనాత్ "

" శివరాత్రినాడు ఉపవాసం ఉండి, ఇంద్రియాలను వశపరచుకుని, శక్తిలోపం లేకుండా, త్రికరణశుద్ధిగా నన్ను పూజించిన వారికి, సంవత్సరమంతా నిరంతరాయంగా నా పూజ చేసినంత ఫలితం లభిస్తుంది " అని తెలియచేసారు శివుడు. 

మనకు శైవులు, వైష్ణవులు అని సాధారణంగా అనుకుంటూ ఉండమే తెలుసు. కాని ఈ శైవులలో 5 విభాగాలను  ప్రధాన శైవాలుగా గుర్తించారు. వాటి గురించి చదువుదాం:

1.శుద్ధశైవము: ఇది రాజస్థాన్ నుంచి మైసూర్ వరకూ తూర్పున ఆంధ్రా తీరం వరకూ వ్యాపించి ఉండేది. దీనిలో మళ్ళీ పశుపతులు, కాపాలికులు, కాలముఖులు, గోరక్షకనాధులు, రాసేశ్వరులు అనే విభాగాలు ఉండేవి. వీరిలో కాలముడులు మన గుంటూరులో ఉండేవారని తెలుస్తూంది. దీనినే కాశ్మీరశైవం అని కూడా పిలిచేవారు. దీనిని దూర్వాసుని మొదటి ఇద్దరు పుత్రులు వ్యాప్తిలోకి తెచ్చారు. ఇది ఉత్తరభారతంలో ఎక్కువగా ఉంటుంది.

2. ద్రావిడ శైవం: దీనిని దూర్వాసుని మూడవ పుత్రుడు వ్యాప్తి చేసారు. బౌద్ధ జైన మతాలను ఖండించి వాటి వ్యాప్తిని అరికట్టడంలో ఈ శైవం పాత్ర అధికమని తెలుస్తూంది.

3. మిశ్రశైవం: సాధారణంగా చాలామంది ఈ శైవాన్ని అనుసరిస్తారు. వీరు పంచాయతనం పూజ చేస్తారు. శివుని మీద ప్రేమ ఎక్కువ అయినా అందరు దేవతలను పూజిస్తారు. మనమందరం ఈ కోవలోని వారమని అనుకోవచ్చు.

4. సామాన్యశైవం: వీరు శివుని ప్రథమ దైవంగా భావిస్తారు.

5. వీరశైవం: ఇది బసవేశ్వరుడితో ప్రారంభం అయినట్లుగా తెలుస్తూంది. వీరు లింగాన్ని చేతిలో ఉంచుకుని పూజిస్తారు. శివునికి నివేదించిన ఆహారాన్నే తీసుకుంటారు. వేదాలకన్నా కూడా వీరి ఆగమవిధానమే వీరికి ప్రామాణికం.

ఇప్పుడు శివలింగం వెనుక ఉన్న శాస్త్రీయ విజ్ఞానం చూద్దాం:

ఆపాతాళ నభః స్థలాంత 
భువన  బ్రహ్మాండ మావిర్భవ
జ్జ్యోతిః స్ఫాటికలింగమౌళి విలసత్‌ పూర్ణేందువాంతామృతైః,
అస్తోకాప్లుత మేకమీశ మనిశం
రుద్రానువాకాన్ జపన్
ధ్యాయేదీప్సిత సిద్థయే
ధ్రువపదం విప్రోభిషించేచ్ఛివమ్‌ "

" పాతాళం నుండి ఆకాశం వరకూ సమస్తం ఒకటే  లింగం. ఆ లింగ రూపం బ్రహ్మాండం. వెలుగులతో కూడిన జ్యోతిర్మయమయిన లింగం శుధ్ధమయిన స్ఫటికంలా ఉంటుంది " అని.

శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు నమకచమకాలు చదివేముందు ఈ ధ్యాన శ్లోకం చదువుతూ ఈ సృష్టి మొత్తంగా వ్యాపించిన  ఆ మహాశివ లింగానికి అభిషేకం చేస్తున్నామని భావిస్తారు భక్తులు.

ఈ బ్రహ్మాడం అంతా అంటే విశ్వం ( యూనివర్స్ ) లింగాకారం ( స్తంభంలా ) లో ఉందని.

మన విష్ణుపురాణం అంతరిక్షంలోని ఎన్నో అద్భుతమైన విషయాలు తెలియచేసింది వేల సంవత్సరాల క్రితమే. అందులో ఒకటి శింశుమార/శిశుమార చక్రం. శింశుమారం అంటే మొసలి వంటి జంతువు. ఈ విశ్వమంతా ( లింగంలో ) శింశుమారచక్రంలా/లో ఉందని.

పడుక్కున్న మొసలిని  పైనుంచి, దూరంనుంచి చూస్తే మన వెన్నెముకలా ఉంటుంది కదా.

అదీ మన శివలింగం వెనుక ఉన్న శాస్త్రీయత. అదీ మన ఋషుల విద్వత్తు, విజ్ఞానం. అదీ మన సనాతనధర్మం విశిష్టత.

వివేకానందుడు " సైన్సు అభివృద్ధి చెందే కొలదీ మన ప్రాచీన వాజ్మయం గొప్పదనం ప్రపంచానికి అర్ధమవుతుంది " అన్నారు. ఇది సత్యం.

వేదో2ఖిల మూలం. అన్నిటికీ మూలం మన వేదమే.

మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ.

శుభం భూయాత్



Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ