త్రిగుణాలు కూడా ఉండాలి మనిషిలో, ఉంటేనే జీవితం ఉగాది పచ్చడిలా కమ్మగా ఉంటుంది - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" త్రిగుణాత్మికా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 763 వ నామం.
" త్రిగుణాత్మికా " అంటే త్రిగుణముల సామ్య స్వరూపురాలు. త్రిగుణాలు అంటే సత్వరజోతమోగుణాలు. మూడింటిలోనూ అమ్మవారు స్థితులయి ఉంటారు.
అమ్మవారిని మహాగౌరీ మహాలక్ష్మీ మహాసరస్వతీ అని పూజిస్తాం. సత్వగుణం గౌరీదేవి, రజోగుణం లక్ష్మీదేవి, తమోగుణం సరస్వతీదేవి.
ప్రతీ జీవిలోనూ మూడుగుణాలూ ఉంటాయి. ఉండాలి. ఉంటేనే జీవితం ఉగాది పచ్చడిలా రమ్యంగా ఉంటుంది.
కోరికలు తప్పుకాదు. సత్వగుణంతో కోరిక ధర్మబద్ధంగా ఉంటుంది. రజోగుణంతో కోరిక స్ధాయికి మించి ఉంటుంది. తమోగుణంతో కోరిక మోసం, దొంగతనం, హింసతో పొందేలా ఉంటుంది.
ఈ మూడు గుణాలూ ఎల్లప్పుడూ ఒకదానితో ఒకటి పోటీ పడుతూ మిగతా రెండూ తన అధీనంలో ఉండాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాయి.
ఏదయినా కోరిక కలిగినప్పుడు ఇది తనకు తగునా, అవసరమా అని కొద్దిసేపు ఆలోచన చేస్తూండాలి. అలా ఆలోచన చేస్తూ ఉంటే సత్వగుణం ఓ మెట్టుపైన ఉంటుంది ఎప్పుడూ. జీవితం ఆనందదాయకంగా సాగిపోతుంది.
ధృవుడు కఠోర సాధనతో అనితరసాధ్యమయిన విష్ణు దర్శనం పొంది పరమ భాగవతోత్తముడు అయాడు. ఓసారి అతని తమ్ముడు వేటకు వెళ్ళి అలకాపురిలో ప్రవేశించాడు. అక్కడ ఓ యక్షుడితో గొడవ పెట్టుకుని యక్షులచేతిలో మరణించాడు. ధృవుడు విషయం తెలిసి కోపంతో అలాకపురికి యుద్ధానికి వెళ్ళాడు. యక్షులు అందరూ పారిపోయారు. అప్పుడు అలకాపురాధిపతి కుబేరుడు వచ్చాడు. అతనితో కూడా యుద్ధానికి తయారయిపోయాడు ధృవుడు. అప్పుడు స్వాయంభు మనువు వచ్చి ధృవుడితో " నువ్వు విష్ణువు దర్శనం పొందిన భాగవతోత్తముడవు. ఇటువంటి యుద్ధాలు నీకు అవసరమా " అని మందలించడంతో ధృవుడు తామసగుణంలోంచి బయటపడ్డాడు. మహామహులే మాయలో పడిపోతారు. ఇక సామాన్యుల గురించి చెప్పేదేముంది.
" దైవీ హ్యేషా గుణమయీ
మమమాయా దురత్యయా "
- భ.గీత 7:14
" త్రిగుణముల ప్రభావం వలన నా మాయను తప్పించుకోవడం మహామహులకు కూడా అంత సులభం కాదు " అన్నారు స్వామి గీతలో.
అమ్మవారి పాదాలను ఆశ్రయించి రజోతమో గుణాలను అదుపులో ఉంచి జీవితాన్ని సుఖమయం చేయమని అందరం వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment