సంసారం అనే రోగంలో ఒకసారి పడితే బయటపడడం కష్టమే - చీమల పాటి సూర్యనారాయణ

🙏"శ్రీమాత్రేనమః"🙏

" సర్వవ్యాధిప్రశమనీ " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 551 వ నామం. 

అమ్మవారి ప్రతీనామానికి ఓ పరమార్ధం ఉంది. ఒక్కోనామాన్ని జపంచేసుకుంటే ఒక్కో ఫలితం కనిపిస్తుంది.

" సర్వవ్యాధిప్రశమనీ " అంటే అన్ని వ్యాధుల్ని పూర్తిగా నయంచేస్తుంది అని అర్ధం. " ప్ర " అంటే పూర్తిగా అని అర్ధం. వ్యాధి అంటే భవరోగం అనగా సంసారరోగం. అంతే కాని జ్వరం, కాలునొప్పి, కన్నునొప్పి లాంటివి కాదు. ఇవన్నీ చిన్నచిన్నరోగాలు, వస్తూంటాయి పోతూంటాయి కాని సంసారరోగం అలాంటిది కాదు. ఓ సారి మొదలవుతే బయటపడడం కష్టం. బయటపడాలంటే అమ్మవారు అనుగ్రహించాలి. 

విష్ణుసహస్రంలో " ఉత్తారణః " అని ఒకనామం. సంసారసాగరాన్ని దాటిస్తారని అర్ధం. 

" కాలాత్మా  సర్వభూతాత్మా 

  వేదాత్మా విశ్వతోముఖః,  

  జన్మమృత్యుజరావ్యాధి  

  సంసారభయనాశనః " 

అని ప్రార్ధన చేస్తాం ఆదిత్యుడిని. ఆయన ప్రత్యక్షనారాయణుడు, ఆరోగ్యప్రదాత. ఈ భయాలన్నీ పోగొడతాడని జనుల విశ్వాసం. 

మిగతా వైద్యములు కారణం చూసి మందులు ఇస్తాయి. కాని ఆయుర్వేదం కారణం వెనుక కారణం చూస్తుంది. అన్ని వ్యాధులకు మూలం అధర్మం అని సనాతనధర్మం తెలియచేస్తూంది. ఏ వ్యాధి అయినా ఆహారం, నీరు, గాలి కలుషితం అవడం వలననే కదా వస్తుంది. దానికి కారణం ఏమిటి? తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో కల్తీ చేసి అయినా ఎక్కువ సంపాదించాలనే ఆరాటం. అంటే అధర్మం అని తెలుస్తూంది.

మనుషులందరూ ధర్మపరులయితే సమాజం ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటుంది. అలా ఉండేలా అనుగ్రహించమని అమ్మవారిని వేడుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య 

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ