అజ్ఞానం ఒక వరం, అమ్మవారి మాయ మన బాగు కోసమే - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" సర్వమోహినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 703 వ నామం.
" సర్వమోహిని " అంటే సర్వమును మోహంలో పడవేయునది అని అర్ధం.
అదేమిటండీ ఆవిడ తల్లికదా, అందరినీ రక్షించాలి కాని మోహం/మాయలో పడవేయడం ఏమిటి అనుకోవచ్చు. కాని ఆవిడ ఏది చేసినా జీవుల మంచికోసమే. ఓ తల్లి చంటిపిల్లాడితో కలిసి ఆరుబయట ఉందనుకుందాం. వర్షం వస్తూంది. ఉరుములు మెరుపులు వస్తున్నాయి. తల్లి ఏమి చేస్తుంది, పిల్లాడి చెవులు, కళ్ళూ మూస్తుంది, తట్టుకోలేడని భావించేకదా. అలాగే కొన్ని జీవులు తట్టుకోలేక, నిగ్రహించుకోలేక మాయలో పడిపోతాయి. అనుకోవడంకన్నా అమ్మవారే దయతో మాయలో పడేస్తుందని అనుకోవాలి. కొన్నిసమయాలలో అజ్ఞానం ఒక వరం.
శాస్త్రజ్ఞులు ఏమన్నారంటే " వైరస్ ఎప్పుడూ మన చుట్టూనే ఉంటుందిట. మనలో శక్తి తగ్గినప్పుడు శరీరంలోకి ప్రవేశిస్తుంది " అని. అలాగే అమ్మవారి మాయ కూడా. జీవులందరూ మాయ/మోహంతో కప్పబడే ఉంటారు. అజ్ఞానం పెరిగినప్పుడు ( చుట్టూ ఉన్నవే శాశ్వతం అనే భ్రమలో పడినప్పుడు ) మాయకు లోనవుతారు.
ఓ పెద్దాయనకు 70 దాటాయి. ప్రభుత్వ ఉద్యోగంలో విరమణచేసి పింఛను తీసుకుంటూ రామా కృష్ణా అనుకుంటూ హాయిగా ఉంటాడు. అప్పుడు వస్తాడు ప్రభుత్వంలోని ఓ పెద్దాయన. మీరు మా ప్రభుత్వంలో " సలహాదారు " గా చేరాలి, మమ్మల్ని ఉద్దరించాలి అని. ఈ వయస్సులో నాకు అవసరమా, ఎందుకొచ్చిన గొడవ అని అనుకోడు. వెంటనే ఉబ్బిపోయి వెళ్ళి చేరిపోయి చిక్కుల్లో పడిపోతాడు. మహామాయ
లలితా సహస్రనామాలకి " భాష్యం వ్రాయాలనుంది అనుగ్రహించు తల్లీ " అని శంకరాచార్యులవారు వేడుకుంటే దానికి త్వరలో ఇంకొకాయన ( భాస్కరరాయులు ) పుడతారు, నువ్వు వద్దులే నాయనా అంన్నారుట అమ్మవారు. అలా ఉంటాయి అమ్మవారి ఏర్పాట్లు.
సర్వే జనాః సుఖినో భవంతు.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య
శుభం భూయాత్
Comments
Post a Comment