అమ్మవారు అద్భుత సౌందర్యవతి, శివుడినే మెప్పించిన సౌందర్యం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏


" చారురూపా " - అమ్మవారి అద్భుతనామం. ఇవి శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 241 వ నామం.

" చారురూపా " - అందమైన రూపం గలిగినది.  " చారు  " అంటే అందమైన, సుందరమైన అని అర్ధం.

అమ్మవారు ఎంత అందంగా సుందరంగా ఉంటారో " మూకకవి " తన " మూకపంచశతి " లో వర్ణన చేసారు. అమ్మవారు " తాంబూలపూరితముఖీ " - అంటే నోటిలో తాంబూలం నములుతూ ఉంటారుట. కొద్దిగా తాంబూల పిడచని ఇచ్చింది ఓ మూగభక్తుడికి. అది నోట్లో వేసుకోగానే ఆ మూగవాని నోటివెంట 500 శ్లోకాలు ఆశువుగా వచ్చేసాయి అమ్మవారిని ( కామాక్షీదేవిని ) వర్ణన చేస్తూ. వంద వంద శ్లోకాలు అమ్మ చిరునవ్వు, చూపులు, పాదారవిందాల గురించీ వర్ణన చేసేసారు మూకకవి. ఇది " మూకపంచశతి " గా ప్రసిద్ధిచెందింది.

మొదటిది " ఆర్యాశతకం " లో ఇలా వర్ణన చేసారు:

" పంచశరశాస్త్రబోధన
  పరమాచార్యేణ దృష్టిపాతేన,
  కాంచీసీమ్ని కుమారీ కాచన
  మోహయతి కామజేతారం "
            - ఆర్యాశతకం:5.

" కాముడిని జయించిన ఆయనను తనను మోహించేలా చేసుకున్న కాంచీపురం అమ్మాయి " అని అర్ధం. మన్మధుడే శివుణ్ణి ఏమీ చెయ్యలేక భస్మమయిపోయాడు. శివుడు కామానికి మోహానికి అతీతుడు. మరి అటువంటి ఆయన్ని ఈవిడ ( తన సౌందర్యంతో, బాహ్య సౌందర్యం అనుకోకూడదు ) మోహింపచేసుకుందని భావం. ఎంత అద్భుత భావన.

అందరికీ ఏ కష్టాలు లేకుండా జీవితం ఆనందంగా గడిచేలా అనుగ్రహించమని అమ్మవారిని కోరుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్ 

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ