భార్యాభర్తల సంబంధం ఎటువంటిదో తెలియచేసింది సనాతనధర్మం - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" రమణలంపటా " - అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 320 వ నామం.
" రమణలంపటా " అంటే తన భర్త యందు ఆసక్తి/అనురాగం గలిగినది అని అర్ధం.
అనుమామేముంది. ఆకులు అలములు కూడా తినకుండా, మండుటెండలో నిప్పుల మధ్య నిలబడి తపస్సు చేసి శివుడిని వివాహం చేసుకుని అపర్ణగా పూజింపబడుతున్నారు అమ్మవారు.
ఆవిడకు భర్త అంటే అంత అనురాగం కనుకే భర్త హాలాహలాన్ని మ్రింగినపుడు " జ్వాలాతోరణం " క్రింద నుంచి భర్తతో కలిసి 3 మార్లు ప్రదక్షణం చేస్తాను అని అగ్నిదేవుడికి మ్రొక్కుకున్నారు. కార్తీకపౌర్ణమి నాడు జ్వాలాతోరణం జరుపుతారు. అమ్మవారు స్వామితో కలిసి పల్లకీలో జ్వాలాతోరణం క్రిందనుంచి వెడుతూంటే వెనుక భక్తులు హరహరమహాదేవ అంటూ పరిగెడతారు.
రామాయణంలో సీతమ్మ ఒక ధర్మసూక్ష్మం తెలియచేసింది జాతికి. తల్లిదండ్రులు, తోబుట్టువులు, సంతానం ఎవరికయినా ఎవరి భాగ్యం వారిదే, ఎవరి కష్టాలు వారివే. కాని ఒక్క భార్యాభర్తలదే ఒకరి భాగ్యం ఇంకొకరిది. సుఖాలలోనే కాదు, కష్టాలలో కూడా ఒకరికి ఒకరు తోడు అని.
" తపస్సులోగాని బలంలోగాని సంపదలోగాని విక్రమంలోగాని తేజస్సులోగాని కీర్తిలోగాని నాతో సరితూగుతాడా రాముడు " అంటాడు రావణుడు సీతతో. అప్పుడు సీత అంటారు " నీకు మంచిమాట చెప్పడానికి ఒక్క హితుడూ లేడా. మంచిమాట చెప్పి పాలకుడను నియంత్రించే మేధావులు లేకపోతే ఆ రాజ్యం ఎదగదు ( ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో పరిస్థితి ఇదే )" అని చెబుతూ:
" అనన్యా రాఘవేణాహం
భాస్కరేణ ప్రభాయధా "
అంటారు సీతమ్మ రావణుడితో. అంటే సూర్యుడికి వెలుగు ఎలాగో నేను రాముడికి అలాగ అని. ఎంత అద్భుత ఉపమానం. సూర్యుడిని వెలుగుని విడదీయగలమా.
ఇదే విషయాన్ని రాముడు సీత అగ్నిప్రవేశం చేసే సమయంలో అంటారు. సీతారాముల బంధం అటువంటిది, విడదీయలేనిది.
అదీ భార్యాభర్తల బంధం, అలా ఉండాలి అని మన సనాతనధర్మం తెలియచేస్తూంది. మన సనాతనధర్మానికి సాటిలేదు, రాబోదు.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment