శ్రీ ఆదిశంకరుల జయంతి నేడు, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 


జగద్గురువులు, సనాతనధర్మ పరిరక్షకులు, పూజనీయులు శ్రీఆదిశంకరుల జయంతి నేడు,  వైశాఖ శుద్ధ పంచమి. శుభాకాంక్షలు అందరికీ.

" యదా యదాహి ధర్మస్య
  గ్లానిర్భవతి భారత,
  అభ్యుత్థానమధర్మస్య
  తదాత్మానం సృజామ్యహం "
                            - భ.గీత 4:7

" ఎప్పుడయినా ధర్మానికి హాని జరుగుతూన్నప్పుడు ధర్మరక్షణకోసం వస్తూంటాను నేను " అన్నారు పరమాత్మ. అంటే ఎల్లప్పుడూ ఎవరినో ఒకరిని సంహరించడానికే అనుకోనక్కరలేదు. అలాగే ప్రతీసారీ ఆయనే రారు. సనాతనధర్మం పరిరక్షణ కోసం ఎవరినో ఒకరిని పంపిస్తూ ఉంటారు పరమాత్మ. ఆదిశంకరులు అలా వచ్చినవారే. కారణజన్ములు.

వేదాలు కర్మకాండ, వేదాంగాలు ( ఉపనిషత్తులు మొ.గునవి ) జ్ఞానకాండ. ధనవ్యయంతో కూడుకున్న ద్రవ్యయజ్ఞాలకన్నా జ్ఞానయజ్ఞమే మేలు అన్నారు పరమాత్మ ( భ.గీత 4:33 ).

ఆదిశంకరులు " రాబోయేది గడ్డుకాలం, జీవులు సంసారసాగరంలో మునిగిపోయి నానాబాధలూ పడుతూంటారు, దైవచింతనకు సమయం ఎక్కడుంటుంది. అటువంటివారు యజ్ఞాలు, యాగాలు అవీ చేసే అవకాశమెక్కడిది. మరి సనాతనధర్మం ఎలా రక్షింపబడుతుంది అని  అన్నిరకాలుగా చింతనచేసి కర్మకాండకన్నా జ్ఞానకాండయే గొప్పది ( సులువు అంటే అర్ధంవేరేగా తీసుకోవచ్చు ) అనే సంకల్పాన్ని ప్రజల్లోకి తీసుకెడితే రోజూ ఏదో ఒకసమయంలో జపమో, శ్లోకపారాయణో, శ్రవణమో చేసుకుని తరిస్తారు " అని  భావించారు.  దానికోసం శ్రమించారు.

దేశమంతా కాలినడకన 3 సార్లు అనారోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా తిరిగి ఎక్కడెక్కడ సనాతనధర్మానికి హాని జరుగుతూందో/జరిగే అవకాశముందో అక్కడ పండితులతో వాదించి వారిని ఒప్పించి ధర్మసంస్థాపన చేసారు. కర్మకాండయే గొప్పదని ఎవరు అన్నా వారిని వాదనతో మెప్పించి, ఓడించారు.

ధర్మసంస్థాపన, దేశరక్షణ కోసం దేశం నలుమూలలా పీఠాలను స్థాపించారు. ఈ పీఠాలన్నీ దినదిన ప్రవర్ధమానమై నేటికీ సనాతనధర్మ పరిరక్షణకోసం శ్రమిస్తున్నాయి.

సామాన్యులు కూడా తక్కువశ్రమతో ఎక్కువగా భగవద్కృపకు పాత్రులవడంకోసం సౌందర్యలహరి, శివానందలహరి, పంచకాలు, అష్టకాలు భజగోవిందంలను ప్రసాదించారు. పండితుల సౌలభ్యంకోసం బ్రహ్మసూత్రాలకు, విష్ణుసహస్రానికి భాష్యాలు రచించారు.

భాష్యం వ్రాయడం అంత తేలిక అయిన విషయం కాదు. ఎంతో విద్వత్తు ఉండాలి. విష్ణుసహస్రంలో 2వ శ్లోకంలోని రెండో పాదంలో మొదటి నామం అవ్యయః - నాశనములేనివాడు. మళ్ళీ 4వ శ్లోకంలోని మొదటి పాదంలోని చివరి నామం అవ్యయః. అలా నామం మళ్ళీ వస్తే ఎలా. అందుకని శంకరులు రెండో అవ్యయః కి ముందు నామం " నిధిః "ని దీనికి కలిపి నిధిరవ్యయః - నాశనము లేని ఐశ్వర్యము కలవాడు అని ఒక నామంగా చేసి భాష్యం వ్రాసారు. ఇదే ప్రక్రియను భాస్కరరాయలవారు లలితాసహస్రానికి భాష్యం వ్రాసినప్పుడు ఉపయోగించారు. లలితాసహస్రంలో కాంతా అనే నామం రెండుసార్లు వస్తుంది. కాంతా అంటే అందమైనది అని. అమ్మవారి అందానికి లోటేముంటుంది. అలా అని అందమైనవారు అని రెండు సార్లు అంటే ఏమి బాగుంటుంది. అందుకని రెండో నామం కాంతాని " అకాంతా " అన్నారు. కాంతా అంటే అందమైనవారు అన్నప్పుడు అకాంతా అంటే అందమైనవారు కాదు అనో కురూపి అనో కాదు. కం అంటే సుఖం, అకం అంటే కష్టం, అకాంతా అంటే (మన ) కష్టాలను అంతం చేసేవారు అని భాష్యం వ్రాసారు భాస్కరరాయలవారు. అంత కష్టపడ్డారు వారందరూ మన అద్భుత వాజ్మయంని భావితరాలకు అందించడానికి.

ఆయన చేసిన అద్భుత కృషివల్లే వెయ్యిఏళ్ళు పైబడి  పరాయిపాలనలో  అందరూ భ్రష్టుపట్టించాలని చూసినా  సనాతనధర్మం చెక్కుచెదరలేదు, నేటికీ నిత్యనూతనంగా ( సనాత్ + అన - సనాత్ అంటే నిత్యనూతనం ) ఉంది.

మతం అంటే అభిప్రాయం అని అర్ధం. మన ఋషుల అభిప్రాయమే అత్యుత్తమం. ఏ మతంలోనూ " వసుధైక కుటుంబం(కం), సర్వే జనాః సుఖినో భవంతు, తన్మే మనః శివసంకల్పమస్తు " లాంటివి ఉండవు. మనది ధర్మాచరణ.

పుండు చిన్నదే కదా అని అశ్రద్ధచెయ్యకూడదు, తరువాత ఆ అవయవం తీసేయవలసి రావచ్చు. లేదా ప్రాణమే పోవచ్చు.

జన్మనిచ్చిన తల్లిని, దేశాన్ని, మనధర్మాన్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా కించపరిచినా ఊరుకోనక్కరలేదు. ఎక్కడికక్కడ ఖండిస్తూ శంకరాచార్యుల స్ఫూర్తితో ఎదరకు పోవడమే ఇప్పుడు అందరం చెయ్యవలసినది. అలా చేయడమే ఆదిశంకరులకు మనం సమర్పించుకునే ఘనమైన నివాళి.

నేడు శంకరాచార్యుల జయంతి. శుభాకాంక్షలు అందరికీ.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్ 

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ